Amazon: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. జూలై 4 నుంచి భారీ ఆఫర్ల జాతర

by S Gopi |

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్ హోమ్ డివైజ్‌లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు తదితర విభాగాల్లో భారీ ఆఫర్లు ఉండనున్నాయి.

Amazon: అమెజాన్ ప్రైమ్ డే సేల్.. జూలై 4 నుంచి భారీ ఆఫర్ల జాతర
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన 'ప్రైమ్ డే 2026' సేల్‌కు సంబంధించిన ఆఫర్లను ప్రకటించింది. మూడు రోజుల మెగా షాపింగ్ ఈవెంట్ జూలై 4 నుంచి 6 వరకు జరగనుంది. ఇది కేవలం ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈసారి 10వ వార్షికోత్సవం సందర్భంగా 300కుపైగా బ్రాండ్‌ల నుంచి 15,000కు పైగా ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వనుంది. అంతేకాకుండా, 500కుపైగా కొత్త ఉత్పత్తులను కూడా ఈ సేల్‌లోనే మార్కెట్లోకి తీసుకురానుంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్ హోమ్ డివైజ్‌లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులు తదితర విభాగాల్లో భారీ ఆఫర్లు ఉండనున్నాయి. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్ ఎస్25 ఆల్ట్రా రూ.84,999కే లభించనుండగా, రూ.15,000 వరకు తగ్గింపు, 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 13 రూ.49,999కు, ఐఫోన్ 17 సిరీస్, వన్‌ప్లస్ నార్డ్ 6, రెడ్‌మీ ఏ7 ప్రో 5జీ, ఐకూ 15ఆర్ వంటి మోడళ్లపై కూడా ఆఫర్లు ఇస్తున్నట్టు అమెజాన్ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ట్యాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఆడియో ఉత్పత్తులపైనా ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి. ఎం3 ఐప్యాడ్ ఎయిర్ రూ.54,999కు, అదనంగా రూ.3,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. సోనీ బ్రావియా 2 55-అంగుళాల టీవీ రూ.52,999కు, టీసీఎస్ క్యూఎల్ఈడీ టీవీ రూ.38,999 నుంచి, జేబీఎల్ బార్ 800 ప్రో సౌండ్‌బార్ రూ.49,999కు అందుబాటులోకి రానుంది. ఎకో డాట్ (5వ జనరేషన్) రూ.3,999కు, ఎకో పాప్ రూ.2,949కు, ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ రూ.2,999కు, ఫైర్ టీవీ స్టిక్ 4కె ప్లస్ రూ.4,499కు విక్రయించనున్నారు. కొత్త ప్రైమ్ ఏడాది మెంబర్‌షిప్ రూ.999కే అందిస్తుండగా, ప్రైమ్ లట్ రూ.599కు, ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ రూ.299కు లభిస్తుంది. ఎంపిక చేసిన ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అదనపు క్యాష్‌బ్యాక్ కూడా వినియోగదారులకు అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Next Story