గూగుల్ మ్యాప్స్‌తో డ్రగ్స్ దందా..!

by Naga Rani Yarlagadda |

కస్టమర్ల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా గోడల సందులు, రాళ్ల కింద మాదకద్రవ్యాలను దాచిపెట్టి గూగుల్ మ్యాప్స్ ద్వారా దందా చేస్తున్నారు.

గూగుల్ మ్యాప్స్‌తో డ్రగ్స్ దందా..!
X
  • బెంగళూరులో అంతరాష్ట్ర డెడ్ డ్రాప్ ముఠా.. 241 గ్రాముల డ్రగ్స్ సీజ్
  • హైదరాబాద్‌లోని పలు డ్రగ్స్ కేసులతో ముఠాకు లింకులు
  • వివరాలు వెల్లడించిన టీజీ ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య

దిశ, తెలంగాణ బ్యూరో: కస్టమర్ల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా గోడల సందులు, రాళ్ల కింద మాదకద్రవ్యాలను దాచిపెట్టి.. ఆ తర్వాత గూగుల్ మ్యాప్స్ ద్వారా కస్టమర్లకు లొకేషన్లు పంపుతూ పోలీసులకే సవాలు విసురుతున్న భారీ అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయిందని తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. బెంగళూరు ఎన్సీబీ, షాద్‌నగర్ పోలీసులతో కలిసి బెంగళూరులో నిర్వహించిన ఆపరేషన్‌లో 241 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుని, ప్రధాన పెడ్లర్‌ను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలను సందీప్ శాండిల్య మీడియాకు వివరించారు.

గోడ రంధ్రంలో 108 గ్రాములు..

బెంగళూరులోని దొమ్మసంద్ర ప్రాంతంలో జరిపిన పక్కా దాడుల్లో రాహుల్ పి.వి 24 అనే పెడ్లర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని శాండిల్య తెలిపారు. అతడు నేరుగా డ్రగ్స్ ఇవ్వకుండా డెడ్ డ్రాప్ పద్ధతిని వాడుతున్నాడన్నారు. కస్టమర్లకు వాట్సాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌లు పంపి డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత నిర్జన ప్రదేశాల్లోని రాళ్ల కింద, గోడల రంధ్రాల్లో డ్రగ్స్ దాచిపెట్టి ఆ లొకేషన్‌ను వారికి పంపేవాడని చెప్పారు. ఆపరేషన్‌లో భాగంగా రాహుల్ ఇంట్లో 25 గ్రాములు లభించగా.. అతను చెప్పిన డెడ్ డ్రాప్ లొకేషన్లలో ఒకటైన రాతి గోడ రంధ్రంలో దాచిన ఏకంగా 108 గ్రాముల ఎండీఎంఏ దొరికిందన్నారు. మొత్తం 241 గ్రాముల డ్రగ్స్, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాహుల్ ఈ దందా ద్వారా నెలకు రూ.4.5 లక్షలు సంపాదిస్తూ, వారానికి ఏకంగా 1.3 కిలోల ఎండీఎంఏను సరఫరా చేస్తున్నాడని శాండిల్య వివరించారు.

నైజీరియా నుంచి నడిపిస్తున్న కింగ్‌పిన్..

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌కు చెందిన రాహుల్ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులోని కారు షోరూమ్‌లో పనిచేసేవాడన్నారు. ఉద్యోగం పోవడంతో డ్రగ్స్‌కు బానిసై, నైజీరియన్‌ కింగ్‌పిన్ మైఖేల్ జాన్సన్ అలియాస్ హానర్‌కు ఏజెంట్‌గా మారాడన్నారు. మైఖేల్‌ను పోలీసులు మూడు నెలల క్రితమే ఇండియా నుంచి బహిష్కరించినా.. అతను నైజీరియాలో కూర్చొని వర్చువల్ నంబర్ల ద్వారా రాహుల్‌ను నడిపిస్తున్నాడని తెలిపారు. రాహుల్ గతంలో జైలుకెళ్లొచ్చినా తీరు మార్చుకోకుండా, మైఖేల్ దగ్గర రూ.1,100కు గ్రాము డ్రగ్ కొని కస్టమర్లకు రూ.2,000కు విక్రయిస్తున్నాడని చెప్పారు.

హైదరాబాద్ లింకులపై దర్యాప్తు..

ఇటీవల మోహిత్ కుమార్ అనే వ్యక్తిని ఈగిల్ ఫోర్స్, షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ భారీ నెట్‌వర్క్ డొంక కదిలిందని సందీప్ శాండిల్య తెలిపారు. మోహిత్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఈగిల్ బృందాలు ఐదు రోజుల పాటు బెంగళూరులో నిఘా వేసి రాహుల్‌ను పట్టుకున్నాయన్నారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మనీ ట్రైల్‌ను గుర్తించామని, తెలంగాణకు చెందిన 10 మంది పెడ్లర్లు, కస్టమర్ల వివరాలు రాబట్టామని ఆయన తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని గచ్చిబౌలి, జవహర్ నగర్, పేట్‌బషీరాబాద్, కార్ఖానా, శామీర్‌పేట్, గోల్కొండ పోలీస్ స్టేషన్లలో నమోదైన పలు డ్రగ్స్ కేసులకు ఈ రాహుల్ ముఠాయే సరుకు సరఫరా చేసినట్లు ఆధారాలు లభించాయన్నారు. పరారీలో ఉన్న మిగతా ఏజెంట్ల కోసం తమ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయని శాండిల్య స్పష్టం చేశారు.

Next Story