రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

by Batti.Sumithra |

సహకార బ్యాంకులు రైతులకు, గ్రామీణ ప్రజలందరికీ ఆర్థిక పరంగా అండగా నిలుస్తూ, పొదుపు, రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

రైతుల అభ్యున్నతే సహకార బ్యాంకుల ప్రగతికి పునాది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
X

దిశ, సత్తుపల్లి : సహకార బ్యాంకులు రైతులకు, గ్రామీణ ప్రజలందరికీ ఆర్థిక పరంగా అండగా నిలుస్తూ, పొదుపు, రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు పట్టణంలో సోమవారం ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) కల్లూరు బ్రాంచ్ నూతన భవనాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు మరింత చేరువలో, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో కల్లూరులో నూతన భవనంలో డీసీసీబీ శాఖను ప్రారంభించామని తెలిపారు. రైతు సుభిక్షంగా ఉంటేనే సహకార బ్యాంకులు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. రైతుల ఆదాయం పెరిగి, వారు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, తద్వారా మరింత మంది రైతులకు రుణాలు అందించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

కల్లూరు బ్రాంచ్ ఆర్థికంగా బలమైన శాఖగా ఎదగడానికి వ్యాపారవేత్తలు, ప్రజలు తమ డిపాజిట్లను సహకార బ్యాంకులోనే ఉంచేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. బ్యాంకు బలోపేతమైతే స్థానిక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్న మంత్రి, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లభించిందన్నారు. కల్లూరుకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేస్తూ, త్వరలో ఇంటిగ్రేటెడ్ సబ్-కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఆధునిక పరిపాలనా సముదాయాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు. కల్లూరు మండలంలో సాగునీరు, తాగునీరు, రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. గతంలో మండల కార్యాలయాలు, కళాశాల భవనాలు, నీటి పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వేంసూరులో నిర్మాణంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభమైతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. ఖమ్మం–అశ్వారావుపేట పాత రహదారిని నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు.

అలాగే గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారికి ఎగ్జిట్, ఇతర మౌలిక వసతుల కల్పనకు కూడా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. సత్తుపల్లి నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచి పేరును మరింత పెంచేలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ అవకాశం వచ్చినా ముందుగా సత్తుపల్లి నియోజకవర్గానికి తీసుకురావడానికి కట్టుబడి ఉంటానని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, డీసీసీబీ బ్యాంకు ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులు సకాలంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని సూచించారు. రైతులకు ఎలాంటి రుణాలు అందుబాటులో ఉన్నాయో అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ గంగాధర్, ఏసీపీ వసుంధర యాదవ్, బ్యాంకు సీఈఓ ఎన్. వెంకట ఆదిత్య, డీజీఎం ఎం. సర్వేశ్వరరావు, ఏజీఎం బి. చందర్‌రావు, మేనేజర్ ఎం. అనిత, కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బాగం నీరజ, కల్లూరు మున్సిపల్ చైర్మన్ ఎం. మోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story