- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్టర్ ప్లాన్ రోడ్డుపై “కాసా గ్రాండ్” దాగుడుమూతలు..
దుండిగల్ గండిమైసమ్మ మండలం గాగిల్లాపూర్ పరిధిలోని కోతినారు చెరువు కట్ట దిగువున ప్రముఖ నిర్మాణ సంస్థ కాసా గ్రాండ్ చేపట్టిన ‘సియెర్రా’ విల్లా ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

దిశ, మేడ్చల్ బ్యూరో: దుండిగల్ గండిమైసమ్మ మండలం గాగిల్లాపూర్ పరిధిలోని కోతినారు చెరువు కట్ట దిగువున ప్రముఖ నిర్మాణ సంస్థ కాసా గ్రాండ్ చేపట్టిన ‘సియెర్రా’ విల్లా ప్రాజెక్టులో నిబంధనల ఉల్లంఘనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చెరువు కట్టను ఆక్రమించి, ధ్వంసం చేస్తూ వేసిన అక్రమ మట్టిని, కట్టడాలను ఇరిగేషన్ అధికారులు రంగంలోకి దిగి సదరు నిర్మాణ సంస్థతోనే స్వయంగా తొలగింపజేస్తున్నారు. అయితే, ఈ ఆక్రమణల తొలగింపు ఒక ఎత్తయితే.. భవిష్యత్తులో ఈ వెంచర్‌లో విల్లాలు కొనే కస్టమర్లకు ఎదురుకాబోయే ‘మాస్టర్ ప్లాన్ రోడ్డు’ గండం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మాస్టర్ ప్లాన్ రోడ్డు ఎక్కడి నుంచి?..
హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ప్రాంతంలో 30 మీటర్ల (సుమారు 100 అడుగులు) రహదారి ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం కాసా గ్రాండ్ లేఔట్ వద్ద చెరువు కట్ట దిగువున కేవలం 9 మీటర్ల బఫర్ జోన్ మాత్రమే ఉంది. మరి భవిష్యత్తులో ఈ 30 మీటర్ల రోడ్డు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. సాధారణంగా చెరువు కట్టను లేదా బఫర్ జోన్‌ను డిస్టర్బ్ చేస్తూ రోడ్లు నిర్మించరు. ఒకవేళ రోడ్డు వేయాల్సి వస్తే ప్రస్తుతం ఉన్న చెరువు కట్టను మొదలుకొని 30 మీటర్ల మేర రోడ్డును విస్తరించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే జరిగితే కాసా గ్రాండ్ లేఔట్ ఫ్రంటేజ్ భారీగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ చెరువు కట్ట దిగున బఫర్ జోన్ వదిలిపెట్టి మాస్టర్ ప్లాన్ ప్రకారం 30 మీటర్ల రోడ్డు వస్తే కాసా గ్రాండ్ ‘సియెర్రా’ లో కొనుగోలు చేసిన నిర్మాణదారులకు భారీ నష్టం తప్పదు అని చెప్తున్నారు.
అందమైన ‘గ్రీనరీ’ మాయం కానుందా?
సాటిలైట్ చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఒక నిజం వ్యక్తమవుతోందని నిపుణులు అంటున్నారు. కాసా గ్రాండ్ వారు తమ లేఔట్ ఎంట్రన్స్‌లో వైభవంగా చూపిస్తున్న పెద్ద పార్కు, గ్రీనరీ జోన్‌తో పాటు క్లబ్‌హౌస్ నిర్మాణంలో కొంత భాగం కూడా ఈ 30 మీటర్ల రోడ్డు పరిధిలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బిల్డర్లు ఈ రోడ్డు విస్తరణ ఉన్న ప్రాంతంలోనే పార్కుని, చెట్లను చూపిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. "ఇంత పెద్ద పార్కు ఉంది, ఇంత గ్రీనరీ ఉంది" అని నమ్మి వందలాది కోట్లు కుమ్మరించి విల్లాలు కొనే సాధారణ కొనుగోలుదారులకు ఈ రోడ్డు విస్తరణ ముప్పు గురించి అవగాహన ఉండే అవకాశం చాలా తక్కువ. రేపు రోడ్డు ఎక్స్టెన్షన్ జరిగితే.. తాము నమ్మి కొన్న గ్రీనరీ అంతా రోడ్డు పాలవుతుందని, అప్పుడు తాము మోసపోయామని గ్రహించినా ప్రయోజనం ఉండదని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు.
అధికారులకే స్పష్టత లేదు!
ఈ రోడ్డు విస్తరణ అంశంపై క్షేత్రస్థాయిలో ఉన్న ఇరిగేషన్ అధికారిని వివరణ కోరగా.. "ప్రస్తుతానికి మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణపై పూర్తి అవగాహన లేదు, ప్రస్తుతానికైతే కోతినారు చెరువు కట్టను, బఫర్ జోన్‌ను సంరక్షించేందుకు అక్రమ కట్టడాలను, మట్టిని తొలగించే చర్యలు మాత్రమే చేపడుతున్నాం" అని తేల్చిచెప్పారు. దీనిని బట్టి ఈ రోడ్డు విస్తరణ రేపు కొనుగోలుదారుల పాలిట తీవ్ర ప్రభావం చూపే విధంగా మారబోతుందానేది స్పష్టమవుతోంది.
అనుమతి పత్రాల దాగుడుమూతలు.. వెనకడుగు వేసిన లీగల్ టీం
చట్టప్రకారం ప్రతి నిర్మాణ సంస్థ తమ సేల్స్ ఆఫీస్ ప్రాంగణంలో ప్రభుత్వం జారీ చేసిన ఎన్ఓసీలు, అనుమతి పత్రాలు, అప్రూవ్డ్ లేఔట్ కాపీలను కస్టమర్ల పరిశీలన కోసం అందుబాటులో ఉంచాలి. కానీ కాసా గ్రాండ్ కార్యాలయంలో ఇవేవీ కనిపించడం లేదు. ఈ విషయంపై స్పష్టత కోసం మీడియా ప్రతినిధులు వెళ్లగా.. "సమస్యను అంతర్గతంగా పరిష్కరించుకున్నాం" అని మాట దాటేశారే తప్ప, పత్రాలను బయట పెట్టలేదు. మొదట "మా వద్ద ప్రస్తుతానికి కాపీలు లేవు, సేకరించి మీకు మెయిల్ చేస్తాం" అని చెప్పిన లీగల్ టీం.. ఆ తర్వాత వాటిని ఇచ్చేందుకు వెనకాడటం, ఫోన్లు ఎత్తకపోవడంపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటే దాచాల్సిన అవసరం ఏమొచ్చిందని కస్టమర్లు ప్రశ్నిస్తున్నారు.
అధికారుల తక్షణ చర్యలు అవసరం
భవిష్యత్తులో అమాయక కొనుగోలుదారులు మోసపోకుండా ఉండాలంటే, సంబంధిత హెచ్‌ఎండీఏ, రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించాల్సి ఉంది. 30 మీటర్ల రోడ్డు విస్తరణ జరిగితే కాసా గ్రాండ్ లేఔట్ భూమి ఎంత మేర పోతుందో ఇప్పుడే క్షేత్రస్థాయిలో సర్వే చేసి మార్కింగ్ చేయాలి. ఆ రోడ్డు సరిహద్దు వదిలిపెట్టిన తర్వాతే నిర్మాణాలకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే భవిష్యత్తులో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉంటారని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.






