హరీశ్‌రావుకు మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పింది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

by Naga Rani Yarlagadda |

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతున్న తీరుచూస్తుంటే ఆయ‌న‌కు మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పింద‌నే అనుమానం క‌లుగుతున్నద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు.

హరీశ్‌రావుకు మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పింది : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
X
  • అసెంబ్లీని ఎందుకు ర‌ద్దు చేయాలి?
  • ప్రతి ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు శిక్ష వేస్తూనే ఉన్నారు
  • బీజేపీది ఆశ‌కాదు.. అత్యాశ‌
  • వచ్చే ప్రభుత్వంలో సీఎం ఎవరనేది ఇప్పుడే చెప్పలేం
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతున్న తీరుచూస్తుంటే ఆయ‌న‌కు మెంట‌ల్ బ్యాలెన్స్ త‌ప్పింద‌నే అనుమానం క‌లుగుతున్నద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అన్నారు. సోమ‌వారం సెక్రెటేరియట్‌లో మీడియా ప్రతినిధుల‌తో చిట్ చాట్ నిర్వహించారు. తెలంగాణ ప్రజానీకం తమకు ఐదేళ్లకు అధికార‌మిచ్చారని.. రెండున్నరేళ్లకే ఎందుకు అసెంబ్లీని ర‌ద్దు చేస్తామని అన్నారు. ఇంకా రెండున్నరేళ్ల స‌మ‌యం ఉన్నదని.. గ‌డ‌చిన రెండున్నర ఏళ్లలో జ‌రిగిన ప్రతి ఎన్నిక‌ల్లోనూ ప్రజ‌ల తీర్పు ఏ విధంగా ఉందో హ‌రీశ్‌రావుకు తెలుసని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా వ‌చ్చే తీర్పు ఏముందని.. రెండుకాళ్లు లేనివాడు చూసుకుందాం రా.. అని స‌వాల్ విసిరిన‌ట్లే బీఆర్ఎస్ నాయ‌కుల స‌వాళ్లు ఉంటున్నాయని ఎద్దేవా చేశారు.

వారికి కర్రు కాల్చి వాత పెడుతా..

ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి ప‌నుల‌ను జీర్ణించుకోలేక.. భ‌విష్యత్తులోనూ అధికారం ద‌క్కద‌నే ఆవేశం, ఆక్రోశంతో కేటీఆర్ ఉక్రోషాన్ని వెళ్లగ‌క్కుతున్నారని మంత్రి పొంగులేటి అన్నారు. తన నియోజ‌క‌వ‌ర్గం పాలేరులో కేటీఆర్ విమ‌ర్శలు ఇదే కోవ‌లోకి వ‌స్తాయన్నారు. బీఆర్ఎస్ నాయ‌కులు చేసే చిల్లర విమ‌ర్శల‌కు ప్రతిసారీ స్పందించనని.. ఎప్పుడో ఒక‌సారి క‌చ్చితంగా క‌ర్ర కాల్చి వాత పెడ‌తానని హెచ్చరించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తేనే బాంబులు పేలిన‌ట్టు కాదని.. ప్రజ‌లు ఛీ కొట్టినా బాంబులు ప‌డ్డట్టేనని వెల్లడించారు. ఏ వ్యక్తిమీదా వ్యక్తిగ‌త క‌క్షపూరిత‌మైన చ‌ర్యలు తీసుకోవాల‌నే ఆలోచ‌న ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. త‌ప్పుచేసిన వాళ్ళను జైలులో వేస్తేనే శిక్షించిన‌ట్లు కాదని.. ప్రతి ఎన్నిక‌ల్లో వాళ్లను ఓడించి ప్రజ‌లు శిక్షిస్తూనే ఉన్నారని తెలిపారు. త‌మిళ‌నాడు లాంటి ప‌రిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురామని చెప్పారు.

బీజేపీవి పగటి కలలు..

అధికారంలోకి వ‌స్తామ‌ని బీజేపీ ప‌గ‌టిక‌ల‌లు కంటున్నదని మంత్రి పొంగులేటి అన్నారు. ఆశ ఉండ‌డంలో త‌ప్పులేదు కానీ ఆ పార్టీ అత్యాశ‌కు పోతున్నదని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్ రాని పార్టీ అధికారం గురించి ఆశ ప‌డుతున్నదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని.. కాళేశ్వరం అవినీతి, థర్మల్ ప‌వ‌ర్ ప్లాంట్ అక్రమాల‌పై సీబీఐ విచార‌ణ చేయాల‌ని అడిగితే బీజేపీ ఇప్పటివ‌ర‌కు స్పందించ‌లేదని ఆరోపించారు. ఈ సారి రైతు భ‌రోసా నిధుల‌ను అనుకున్న దానికంటే రెండు మూడు రోజుల ముందే వారం రోజుల్లోనే రైతుల ఖాతాలో జ‌మ‌చేస్తామని తెలిపారు.

Next Story