మూడు గంటల్లో చోరీ కేసును ఛేదించిన నర్సాపూర్ పోలీసులు

by Ratna Kumari |

నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి రహదారిపై ఉన్న ఫ్లిప్‌కార్ట్, షాడో ఫాక్స్ టెక్నాలజీస్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును నర్సాపూర్ పోలీసులు కేవలం మూడు గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

మూడు గంటల్లో చోరీ కేసును ఛేదించిన నర్సాపూర్ పోలీసులు
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ పట్టణంలోని సంగారెడ్డి రహదారిపై ఉన్న ఫ్లిప్‌కార్ట్, షాడో ఫాక్స్ టెక్నాలజీస్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును నర్సాపూర్ పోలీసులు కేవలం మూడు గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నర్సాపూర్ సీఐ రంగాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన మేడి శ్రీధర్ (46) రేడియంట్ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీస్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. నర్సాపూర్ ప్రాంతంలోని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, షాడో ఫాక్స్ టెక్నాలజీస్ సంస్థల నుంచి రోజువారీ నగదు సేకరించి బ్యాంకుల్లో జమ చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 26 నుంచి బ్యాంకులకు వరుస సెలవులు ఉండటంతో ఫ్లిప్‌కార్ట్, షాడో ఫాక్స్ టెక్నాలజీస్ కార్యాలయాల్లో మూడు రోజుల నగదు నిల్వగా ఉందని తెలుసుకున్న శ్రీధర్, ఆ నగదును దొంగిలించాలని పథకం రచించాడు. ఈ క్రమంలో తన బంధువు, మెదక్‌లోని ఫతేనగర్‌కు చెందిన టిఫిన్ సెంటర్ వ్యాపారి సాయిని రవి (41)తో కలిసి కుట్ర పన్నాడు. ఆదివారం అర్ధరాత్రి నర్సాపూర్‌కు చేరుకున్న నిందితులు కార్యాలయం వెనుక తలుపులను బలవంతంగా తెరిచి లోపలికి ప్రవేశించారు. అనంతరం సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి, కార్యాలయంలో ఉన్న రూ.2,66,850 నగదుతో పాటు సీసీటీవీ డీవీఆర్‌ను అపహరించి, స్కూటీపై మెదక్‌కు వెళ్లిపోయారు. సోమవారం దొంగిలించిన నగదుతో హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, నర్సాపూర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నెంబర్ ప్లేట్ లేని టీవీఎస్ స్కూటీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. తనిఖీల్లో వారి వద్ద నుంచి రూ.2,66,850 నగదు, హైక్‌విజన్ కంపెనీకి చెందిన డీవీఆర్, చోరీకి ఉపయోగించిన టీవీఎస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు డీవీఆర్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన నర్సాపూర్ పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story