- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవుడి భూమికి దిక్కెవరు..?
చుట్టుపక్కల అపార్ట్మెంట్లు.. ఇండిపెండెంట్ గృహాలు. గజం సుమారు లక్షన్నరకు పైగానే పలుకుతుంది. అది సుమారు నాలుగు ఎకరాల స్థలం. గతంలో కబ్జాకు గురవగా ఎండోమెంట్ అధికారులు దానిని కాపాడారు.

దిశ, గండిపేట : చుట్టుపక్కల అపార్ట్మెంట్లు.. ఇండిపెండెంట్ గృహాలు. గజం సుమారు లక్షన్నరకు పైగానే పలుకుతుంది. అది సుమారు నాలుగు ఎకరాల స్థలం. గతంలో కబ్జాకు గురవగా ఎండోమెంట్ అధికారులు దానిని కాపాడారు. రెండేళ్ల క్రితం దానిని చిన్న చిన్న ముక్కలుగా చేసి లీజుకు ఇస్తామని వెల్లడించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో క్రమంగా సదరు భూమి వ్యాపారి కార్ల పార్కింగ్ కోసం వినియోగించుకోవడం గమనార్హం.
కోట్లు విలువ చేసే భూమిపై నిర్లక్ష్యమేల..?
అత్తాపూర్ లో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సుమారు 50 ఎకరాల భూమి ఉంది. అందులో భాగంగానే ప్రస్తుత అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హైదర్గూడ డివిజన్లో జనప్రియ అపార్ట్మెంట్ వెనుక భాగంలో సర్వేనెంబర్ 335, 446 లో సుమారు నాలుగు ఎకరాల భూమి ఉంది. అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ గృహాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో గజం ధర సుమారు లక్షన్నరకు పైగానే పలుకుతుంది. చాలా సంవత్సరాల క్రితం సదరు భూమి కబ్జాకు గురవగా కోర్టులో పోరాటాలు చేసిన దేవాదాయ శాఖ అధికారులు చివరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య నాలుగు ఎకరాల భూమిని కాపాడారు. దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. త్వరలో నాలుగు ఎకరాల భూమిని చిన్నచిన్న భాగాలుగా విభజించి లీజుకు ఇచ్చి తద్వారా వచ్చే డబ్బులను దేవుడి ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు.
చర్యలు శూన్యం..
దేవుడు భూమిని కాపాడిన దేవాదాయ శాఖ అధికారులు అనంతరం తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందల కోట్లు విలువ చేసే భూమి విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాపాడిన నాలుగు ఎకరాల భూమిని లీజుకు ఇస్తే ఎండోమెంటు విభాగానికి డబ్బులు వస్తాయి. తద్వారా అనంతపద్మనాభ స్వామి ఆలయ బాగోగులకు వాటిని వినియోగించవచ్చు. అయితే దేవాదాయ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భూమిని చిన్నచిన్న భాగాలుగా చేసి లీజుకు ఇస్తే నెలకు సుమారు ఐదారు పైగానే డబ్బులు వస్తాయి. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి కాపాడిన భూమిని తిరిగి కబ్జా పాలు చేస్తారా అని మండిపడుతున్నారు.
క్రమంగా కార్ల గోడౌన్..
నాలుగు ఎకరాల భూమి బాగోగులను ఎండోమెంట్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఓ కార్ల వ్యాపారం చేసే ఓ వ్యక్తి ఎండోమెంటు జాగాలు దర్జాగా కొన్ని సంవత్సరాలుగా పార్కింగ్ అడ్డాగా మార్చి వినియోగించుకోవడం గమనార్హం. అధికారులు పట్టించుకోకపోతే క్రమంగా అది తిరిగి కబ్జా గురవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి నాలుగు ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.
ఊరుకునేది లేదు.. జెసిబి పెడతాం..
వెంటనే దేవాదాయ శాఖ భూమిని కాపాడుతాం. గతంలో కాపాడిన భూమిలో ప్రైవేటు పనులకు ఉపయోగించేది లేదు. వెంటనే భూమిలో జెసిబి పెట్టి కార్లను మొత్తం తొలగిస్తాం. దానిని చదును చేసి ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో లీజుకు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. భూమిని కబ్జా కాకుండా కృషి చేస్తాం.
మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ రెవెన్యూ ఇన్స్పెక్టర్






