- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉసురు తీసిన కరెంటు పని!
షాబాద్ మండల కేంద్రంలోని ధ్యానహిత హైస్కూల్‌లో విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో కరెంటు షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, షాబాద్ : షాబాద్ మండల కేంద్రంలోని ధ్యానహిత హైస్కూల్‌లో విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న సమయంలో కరెంటు షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతుడు షాబాద్ గ్రామానికి చెందిన సాయి తేజగా గుర్తించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, సాయి తేజ గత కొంతకాలంగా షాబాద్ మండలంలోని సబ్‌స్టేషన్‌కు సంబంధించిన విద్యుత్ పనుల్లో పాల్గొంటున్నాడు. సోమవారం ధ్యానహిత పాఠశాలలో విద్యుత్ మరమ్మతుల పనుల నిమిత్తం స్తంభం ఎక్కి పనిచేస్తుండగా, అకస్మాత్తుగా కరెంటు షాక్‌కు గురై స్తంభంపైనే కుప్పకూలాడు. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, భద్రతా సామగ్రి అందుబాటులో లేకపోవడం, విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై స్పందించిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) కోటేశ్వరరావు మాట్లాడుతూ, మృతుడు విద్యుత్ శాఖ ఉద్యోగి కాదని, శాఖ తరఫున అతడిని విధుల్లో నియమించలేదని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను మృతుడి కుటుంబ సభ్యులు ఖండించారు. తమ కుమారుడిని అధికారులకు తెలిసే పనిలో పెట్టుకున్నారని, ప్రమాదం జరిగిన తర్వాత బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ఉద్యోగి కాదని చెబుతున్నారని ఆరోపించారు. తమ కుమారుడి మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తిస్థాయి శిక్షణ లేని యువకుడితో ప్రమాదకరమైన విద్యుత్ పనులు చేయించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. షాబాద్ సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి తండ్రి దర్జీ శేఖర్ తన కుమారుడి మరణంపై ఎటువంటి అనుమానం లేదని దరఖాస్తులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






