వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉప‌సంహ‌రించాలి

by Naga Rani Yarlagadda |

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉప‌సంహ‌రించాలి
X

- రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే నిబంధనలను సవరించాలి

- కేబినెట్ నిర్ణయం తరువాతే కొత్త చట్టంపై తుది నిర్ణయం

- ఉన్నత‌స్థాయి స‌మావేశంలో తేల్చిచెప్పిన మంత్రి సీత‌క్క

దిశ, తెలంగాణ బ్యూరో: వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ఉపసంహరించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీజీ రామ్‌జీ చట్టం అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను ఆమె వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్త చట్టంలో రాష్ట్రాలపై అధిక ఆర్థిక భారం మోపే నిబంధనలు ఉన్నాయని.. వాటిపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిందని తెలిపారు. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో ఉపాధి హామీ పథకం కింద కూలీల వేతన భారం 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించేదని.. మెటీరియల్ కాంపోనెంట్‌లో కూడా కేంద్రం 75 శాతం వాటా కల్పించేదని గుర్తు చేశారు. కొత్త విధానంలో 60:40 నిష్పత్తి అమలు చేయడం వల్ల రాష్ట్రాలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నదని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వాటా కొన్ని వందల కోట్ల రూపాయల పరిధిలో ఉండగా, కొత్త విధానంలో తెలంగాణ వాటా సుమారు రూ.2వేల కోట్ల వరకు పెరిగే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.

వీబీజీ రామ్‌జీ చట్టంలో ప్రతిపాదించిన కొన్ని నిబంధనలు పేదలు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా చట్టాన్ని తీసుకురావడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. చట్టానికి పేరు మార్చడమే కాకుండా, అమలులో రాష్ట్రాలపై అదనపు ఆర్థిక బాధ్యతలు మోపడం సరైన విధానం కాదన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఇతర కీలక అంశాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద రెండేళ్ల క్రితమే తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల సర్వే పూర్తి చేసి కేంద్రానికి పంపించినప్పటికీ ఇప్పటికీ ఇళ్ల మంజూరు జరగలేదని, వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లమల, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో రోడ్లు, నివాసాలు, బోర్లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం కూడా అటవీ అనుమతుల కారణంగా నిలిచిపోతున్నదని వివరించారు. రోడ్లకు కేంద్రం మంజూరు ఇచ్చినప్పుడే అటవీ శాఖ నుంచి అవసరమైన క్లియరెన్స్‌లు కూడా కల్పించే విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. వీబీజీ రామ్‌జీ చట్టంపై పరిశీలించిన అనంతరమే మంత్రివర్గం తుది నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కొత్త చట్టంలో చేరాలా, వద్దా అనే అంశంపై జూలై 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నిర్ణయం తెలియజేస్తామని మంత్రి తెలిపారు.

Next Story