Housing Market: ఇళ్ల అమ్మకాలకు బ్రేక్

by S Gopi |   (  Updated:2026-06-29 15:24:20  IST  )

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు ఏడాది క్రితంతో పోలిస్తే 6 శాతం తగ్గి 90,715 యూనిట్లకు చేరాయి.

Housing Market: ఇళ్ల అమ్మకాలకు బ్రేక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ప్రధాన నగరాల రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో వృద్ధి కాస్త నెమ్మదించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు, అలాగే కొనుగోలుదారుల్లో పెరిగిన అనిశ్చితి ఎక్కువ ప్రభావితం చేశాయి. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాలు ఏడాది క్రితంతో పోలిస్తే 6 శాతం తగ్గి 90,715 యూనిట్లకు చేరాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ నివేదిక ప్రకారం, పుణెలో అమ్మకాలు అత్యధికంగా 15 శాతం తగ్గగా, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్), ఎన్‌సీఆర్‌లో కూడా తగ్గుదల నమోదైంది. మరోవైపు కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరులో మాత్రం స్వల్ప వృద్ధి కనిపించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంపై ఉన్న అనిశ్చితి కారణంగా చాలామంది కొనుగోలుదారులు నిర్ణయాలను వాయిదా వేస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమ్మకాలు తగ్గినా, కొత్త గృహ ప్రాజెక్టుల లాంచింగ్‌లో మాత్రం జోరు కొనసాగుతోందని నివేదిక తెలిపింది. ఏడాది ప్రాతిపదికన కొత్త ప్రాజెక్టులు 7 శాతం పెరిగి 1.06 లక్షల యూనిట్లకు చేరాయి. ముఖ్యంగా ఎంఎంఆర్, బెంగళూరు నగరాలే కొత్త సరఫరాలో సగానికి పైగా వాటా సాధించాయి. దీంతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇళ్లు కూడా 10 శాతం పెరిగాయి. అయితే త్రైమాసిక ప్రాతిపదికన కొత్త ప్రాజెక్టుల ప్రారంభం తగ్గడం చూస్తే, మార్కెట్‌లో కొనుగోలుదారుల సెంటిమెంట్ ఇంకా పూర్తిగా కోలుకోలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

Next Story