మధిర రామాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం

by Batti.Sumithra |

మధిర మున్సిపాలిటీ మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు.

మధిర రామాలయాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం
X

దిశ, మధిర : మధిర మున్సిపాలిటీ మండల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. సోమవారం ఆయన సతీమణి నందినితో కలిసి రామాలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఆలయ అర్చకులు జనార్ధనాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు, వర్తక, వ్యాపార వర్గాల ప్రముఖులు ఆయనను కలిసి వినతిపత్రాలను అందజేశారు. ప్రాచీన, మహిమాన్విత ఆలయంగా పేరొందిన సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆలయానికి ఉన్న భూమి, చేపట్టవలసిన అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై వైఖానస ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి, అవసరమైన మేరకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఆయన పరోక్షంగా వెల్లడించారు.

ఆలయానికి ఆనుకుని ఉన్న కళ్యాణ మండపం పరిసర ప్రాంతంలోని ఖాళీ భూమికి చెందిన వర్తక, వ్యాపార వర్గాల ప్రముఖులు ఆ భూమిని ఆలయానికి దానంగా ఇవ్వడం లేదా ప్రత్యామ్నాయంగా భూమిని సేకరించడం ద్వారానే రామాలయ అభివృద్ధి సాధ్యమవుతుందని స్థానిక అర్చకులు, ముఖ్య నాయకులు పేర్కొనడం గమనార్హం. పట్టణంలోని ప్రాచీన ఆలయాల్లో రామాలయంతో పాటు శ్రీ మృత్యుంజయస్వామి ఆలయ అభివృద్ధికి కూడా డిప్యూటీ సీఎం గతంలోనే హామీ ఇచ్చిన నేపథ్యంలో, మరోసారి ఈ విషయాన్ని మృత్యుంజయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ పాటిబండ్ల సత్యంబాబు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలు తన దృష్టిలోనే ఉన్నాయని డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఆలయాల అభివృద్ధికి సంబంధించి ఆగమ శాస్త్ర పండితుల సలహాలు, ప్రతిపాదనలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఆలయ ఉద్యోగుల జీతాలపై తక్షణ స్పందన..

మధిర మృత్యుంజయ స్వామి ఆలయంతో పాటు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో కొంతకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులు, ఇతర ఉద్యోగ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగిని రాధా డిప్యూటీ సీఎం దృష్టికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన తక్షణమే దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు సమస్యపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మధిర మున్సిపాలిటీ చైర్‌పర్సన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ ధని కుమార్, కమిషనర్ ఇజ్రాయెల్ పాల్, వార్డు కౌన్సిలర్లు బెజ్జం రాజు, నకిరికంటి రాజేశ్వరి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు పారుపల్లి విజయ్‌కుమార్, తలుపుల వెంకటేశ్వర్లు, నాయకులు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సూరంశెట్టి కిషోర్, మిర్యాల వెంకట రమణ గుప్తా, రంగా హనుమంతరావు, పాటిబండ్ల సత్యంబాబు, టీవీ రెడ్డి, మొండితోక సుధాకర్, నాగార్జున, అనిల్ కుమార్, కరివేద సుధాకర్, తన్నీరు రామకృష్ణ, నిడమానూరు వంశీ, సామినేని రామనాథం, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story