ఇంటింటికీ వెళ్లి తనిఖీ.. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదన్న పట్టుదల

by Batti.Sumithra |   (  Updated:2026-06-29 14:06:31  IST  )

పోలియో రహిత సమాజం' లక్ష్యంగా ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రాష్ట్ర పల్స్ పోలియో అబ్జర్వర్ బృందం సోమవారం మెరుపు తనిఖీలు నిర్వహించింది.

ఇంటింటికీ వెళ్లి తనిఖీ.. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకూడదన్న పట్టుదల
X

దిశ, ఆళ్లపల్లి : పోలియో రహిత సమాజం' లక్ష్యంగా ఆళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రాష్ట్ర పల్స్ పోలియో అబ్జర్వర్ బృందం సోమవారం మెరుపు తనిఖీలు నిర్వహించింది. డా. భ్రమానందం రావు నేతృత్వంలో వచ్చిన బృందం, ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకూడదన్న సంకల్పంతో నేరుగా గ్రామాల బాట పట్టింది. ముత్తారం, అనంతోగు గ్రామాల్లో గడపగడపకూ తిరిగిన అధికారులు, 0-5 ఏళ్ల లోపు పిల్లల వేళ్ల పై సిరా గుర్తును పరిశీలించారు.

ఇంట్లో పిల్లలు ఉన్నారా, చుక్కలు వేయించారా అని తల్లిదండ్రులను ఆరా తీశారు. చుక్కలు వేయించని కుటుంబాలకు పోలియో వల్ల కలిగే నష్టాల పై అవగాహన కల్పించి, వెంటనే సమీప కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యులు డా. తరుణ్ మాట్లాడుతూ రాష్ట్ర బృందం ఇచ్చిన సూచనలు మాకు మార్గదర్శకం. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఉత్సాహంగా పాల్గొని బృందానికి సహకరించారు. అబ్జర్వర్ బృందం ఆకస్మిక తనిఖీలతో ఆళ్లపల్లి పీహెచ్‌సీలో పల్స్ పోలియో కార్యక్రమం మరింత వేగం పుంజుకుంది.

Next Story