నైపుణ్య శిక్షణతోనే ఉద్యోగ అవకాశాలు సాధ్యం

by Ratna Kumari |

నైపుణ్య శిక్షణతోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు.

నైపుణ్య శిక్షణతోనే ఉద్యోగ అవకాశాలు సాధ్యం
X

దిశ, ఆసిఫాబాద్ : నైపుణ్య శిక్షణతోనే మెరుగైన ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు నిర్వహించనున్న ఉచిత నైపుణ్య శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌కు బయలుదేరిన సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ అందిస్తున్న శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదివాసీ మండలాలైన జైనూర్, సిర్పూర్, లింగాపూర్, తిర్యాని, కేరమెరి మండలాలకు చెందిన 45 మంది అభ్యర్థులు శిక్షణకు ఎంపికైనట్లు తెలిపారు. వీరంతా శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, బీఎల్‌వోలతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు 90 శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించాలని, బీఎల్‌వో యాప్‌లో వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సాదా బైనామా, భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. టీ-ఫైబర్ పనుల్లో భాగంగా మండలాల్లో ఉన్న సమస్యలను గుర్తించి సంబంధిత డివిజన్లకు వెంటనే నివేదికలు సమర్పించాలని సూచించారు.

Next Story