- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హద్దుమీరిన మట్టి మాఫియా ఆగడాలు.. ప్రశ్నిస్తే ‘అంతు చూస్తాం’ అంటూ వార్నింగ్!
ఇల్లెందు–కారేపల్లి మండలాల సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మట్టి దందా రోజురోజుకూ విస్తరిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న సంబంధిత శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ,ఇల్లెందు: ఇల్లెందు–కారేపల్లి మండలాల సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ మట్టి దందా రోజురోజుకూ విస్తరిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న సంబంధిత శాఖల అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేని భూముల నుంచి భారీ ఎత్తున మట్టిని తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రింబవళ్లు తరలిస్తూ మట్టి మాఫియా లక్షల రూపాయలు ఆర్జిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తూ "అంతు చూస్తాం" అంటూ హెచ్చరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలుగా యథేచ్ఛగా మట్టి దందా..
గత మూడు నెలలుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా మట్టి మాఫియా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. టిప్పర్ మట్టికి సుమారు రూ.3,500, ట్రాక్టర్ మట్టికి రూ.800 చొప్పున వసూలు చేస్తూ రోజుకు వందలాది లోడ్లు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బడి, గుడి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మట్టి అవసరమనే పేరుతో అనుమతులకతీతంగా భారీగా మట్టిని తరలిస్తున్నారని, ఈ పేరును అడ్డుపెట్టుకుని అక్రమ వ్యాపారం కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అధికారుల మధ్య బాధ్యతల నిర్లక్ష్యం..
అక్రమ మట్టి తవ్వకాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. "ఇది మా పరిధి కాదు" అంటూ ఒక శాఖ పై మరో శాఖ బాధ్యత నెట్టివేస్తోందని, చర్యలు తీసుకోవడంలో మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే మట్టి మాఫియా మరింత రెచ్చిపోతోందని, ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉందో విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు హెచ్చరించినా తగ్గని దందా..
స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు చేసినప్పటికీ అక్రమ మట్టి రవాణా మాత్రం ఏమాత్రం తగ్గలేదని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేసి నిలిపి వేసినప్పటికీ కొద్దిరోజులు ఆగిన మట్టి దందా తిరిగి మళ్లీ ప్రారంభమైంది. రాత్రి వేళల్లో అధిక సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు మట్టిని తరలిస్తూ యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారని, చట్టాన్ని సవాల్ చేసే విధంగా మాఫియా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.
దుమ్ము, ప్రమాదాలతో ప్రజలకు ఇబ్బందులు..
మట్టి రవాణా కారణంగా గ్రామ రహదారులపై దుమ్ము ధూళి విపరీతంగా ఎగిసిపడుతూ ఇళ్లలోకి చేరుతోందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అదే విధంగా వేగంగా వెళ్తున్న టిప్పర్లు, ట్రాక్టర్ల కారణంగా ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించకపోవడం విచారకరమని అంటున్నారు.
అడ్డుకుంటే బెదిరింపులు..
అక్రమ మట్టి దందాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులను మట్టి మాఫియా నేరుగా బెదిరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. "అడ్డుకుంటే అంతు చూస్తాం" అంటూ హెచ్చరిస్తున్నప్పటికీ తాము వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని, బెదిరింపులకు భయపడబోమని తేల్చి చెబుతున్నారు.
ఎమ్మెల్యేకు ఫిర్యాదు.. కలెక్టర్ జోక్యం కోరుతూ విజ్ఞప్తి
ఈ వ్యవహారాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకెళ్లామని, వెంటనే స్పందించి అక్రమ మట్టి దందా పై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని కోరామని స్థానికులు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వయంగా జోక్యం చేసుకుని అక్రమ తవ్వకాలను అరికట్టాలని, మైనింగ్, రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మట్టి మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ మట్టి దందాను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.






