కాషాయీకరణ విద్య ఆరోపణపై ఘాటుగా స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

by Disha Web |
కాషాయీకరణ విద్య ఆరోపణపై ఘాటుగా స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
X

న్యూఢిల్లీ : దేశంలోని విద్యావ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కాషాయీకరణ చేస్తుందన్న ఆరోపణలపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. కాషాయీకరణ చేస్తే తప్పేంటి? భారతీయులు ముందుగా వలసరాజ్యాల హ్యాంగోవర్ నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వ విద్యాలయంలో సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ రికాన్సిలియేషన్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి 'విద్యను కాషాయీకరణ చేస్తున్నారని' వెల్లువెత్తుతున్న ఆరోపణలను తిప్పికొట్టారు.

ఇప్పటివరకు దేశంలో అమలవుతోన్న మెకాలే విద్యావిధానంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారు కాలనీలకు పెట్టుకునే మెకాలేయిజం, ఆంగ్ల విద్యావిధానాన్ని భారతీయులు పూర్తిగా తిరస్కరించాలన్నారు. పూర్వం మన దేశంలో బోధనా మాధ్యమంగా ఆంగ్లాన్ని ప్రవేశపెట్టడంలో బ్రిటిష్ చరిత్రకారుడు థామస్ బాబింగ్టన్ మెకాలే ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విధానం విదేశీ భాష విధింపు విద్యను ఉన్నత వర్గాలకే పరిమితం చేసిందని, దీంతో ఆంగ్లం రాని వారు తమను తాము తక్కువ జాతి వారిగా చూసుకోవడం నేర్పిందని వివరించారు. క్రమంగా ఆంగ్ల విద్యా మన సొంత సంస్కృతిని, సంప్రదాయ వివేకాన్ని తృణీకరించడం నేర్పిందన్నారు. భారతీయులు ఇకపై మన వారసత్వం, సంస్కృతి, మన పూర్వీకుల గొప్పతనం తెలుసుకుని గర్వపడాలి. అందుకోసం మనం మన మూలాల్లోకి తిరిగి వెళ్లాలి. మన వలసవాద ఆలోచనలను విడిచిపెట్టి, మన పిల్లలకు వారి భారతీయ గుర్తింపుపై గర్వపడేలా నేర్పించాలన్నారు. మనం అనేక భారతీయ భాషలను నేర్చుకోవాలి. మన మాతృభాషను ప్రేమించాలి. జ్ఞాన నిధి అయిన మన గ్రంధాలను తెలుసుకోవాలంటే సంస్కృతం నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి తెలిపారు.


Next Story