బదిలీతోనే సరి... అవినీతి, అక్రమాల పై చర్యలు ఉండవా !

by Batti.Sumithra |

స్వయంగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగి, ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి పై వచ్చిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని ఆదేశించినా... ఆ ఆదేశాలు బుట్ట దాఖలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి.

బదిలీతోనే సరి... అవినీతి, అక్రమాల పై చర్యలు ఉండవా !
X

దిశ, బూర్గంపాడు : స్వయంగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగి, ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి పై వచ్చిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని ఆదేశించినా... ఆ ఆదేశాలు బుట్ట దాఖలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. కలెక్టర్ అంతటివారు ఆదేశించినప్పటికీ, సంబంధిత కార్యదర్శి అక్రమాల పై ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరపకపోవడం వెనుక అసలు కథ ఏమిటి ? ఈ కాలయాపన వెనుక విచారణ అధికారుల ‘వాటా’ ఎంత ? అనే ఘాటైన ప్రశ్నలు ఇప్పుడు మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

విచారణ మరుగున పడిందా..?

బూర్గంపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన బర్ల ప్రభాకర్‌ పై వెలువడిన అవినీతి, అక్రమాల విచారణ పూర్తిగా మరుగున పడిందా అంటే... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. కార్యదర్శి బర్ల ప్రభాకర్ సాగించిన అక్రమాల పై బూర్గంపాడు మాజీ ఉపసర్పంచ్ చిప్పా సుధాకర్ లిఖితపూర్వకంగా నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా, సదరు కార్యదర్శి తీరు పై గ్రామ సర్పంచ్ మందా నాగరాజు సైతం జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఈ ఫిర్యాదుల పై స్పందించిన ఉన్నతాధికారులు, బూర్గంపాడు కార్యదర్శి పై తక్షణమే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని బూర్గంపాడు ఎంపీడీవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దర్జాగా బదిలీ.. చర్యలేవి ?

కలెక్టర్ ఆదేశాల ప్రకారం విచారణ చకచకా సాగాల్సింది పోయి, అడుగు ముందుకు పడలేదు సరే కదా... అక్రమ ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శి బర్ల ప్రభాకర్ మాత్రం ఎలాంటి విచారణా ఎదుర్కోకుండానే, చాలా దర్జాగా బదిలీపై వెళ్లిపోవడం గమనార్హం. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపి బాధ్యుల పై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. కేవలం బదిలీతోనే సరిపెట్టడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “తప్పు చేస్తే బదిలీ శిక్షా? లేక సేఫ్ జోనా?” అంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

కలెక్టర్ ఆదేశాలనే బేఖాతరు చేస్తూ విచారణను తొక్కిపెట్టడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తాలు’ ఎవరివి ? కార్యదర్శిని కాపాడటంలో విచారణ అధికారుల పాత్ర ఎంత ? ఈ లీలల్లో అధికారుల వాటాలు ఎక్కడి వరకు వెళ్లాయి ? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, బదిలీతో చేతులు దులుపుకోకుండా... సదరు కార్యదర్శి పై పూర్తిస్థాయి విచారణ జరిపి, అక్రమాలను బయటపెట్టాలని బూర్గంపాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story