చదివేందుకు ఉత్తమ వయసేది? స్వేచ్ఛగా ఎగరాల్సిన సమయంలో చదువుల భారం

by Dishafeatures2 |
చదివేందుకు ఉత్తమ వయసేది? స్వేచ్ఛగా ఎగరాల్సిన సమయంలో చదువుల భారం
X

దిశ, ఫీచర్స్ : అల్లరి చేస్తూ, ఆటలాడే పసి మనసులు.. నాలుగేళ్ల ప్రాయంలోనే అక్షరమాలతో కుస్తీ పడుతూ, పదాలపై పట్టుకోసం పరుగులు పెడుతున్నారు. ఇక మూడేళ్లకే బడిబాట పట్టే పిల్లలూ లేకపోలేదు. అయితే చైల్డ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి కొన్నిదేశాలు ఏడేళ్ల వయసు పరిమితిని పాటిస్తుండగా.. మరికొన్ని దేశాలు ఏజ్ లిమిట్‌ను నాలుగేళ్లుగా నిర్ణయించాయి. మరి ఈ ఏజ్‌లో‌నే చిన్నారులకు జీవితకాల ప్రయోజనాలు అందించగలిగే కీలకమైన ఆరంభం లభిస్తుందా? లేదంటే స్వేచ్ఛను ఆస్వాదించాల్సిన సమయంలో అనవసర ఒత్తిడికి గురవుతున్నారా? అసలు ఏ వయసులో చదవడం, రాయడం ప్రారంభించాలి?

గర్భందాల్చిన 23 వారాల నుంచే శిశువులు తల్లి మాటలతో పాటు ఇతర శబ్దాలను వినగలరు. ఏడాది వయసొచ్చే నాటికి తొలి పదాన్ని పలకనప్పటికీ, మొదటి నుంచే భాష గురించి నేర్చుకుంటారు. తల్లి గొంతు వినేందుకు ఆతృత ప్రదర్శిస్తారు. తమతో మాట్లాడినా, పాటలు వినిపించినా, కథలు చెప్పినా శ్రద్ధగా వింటారు. ఈ మేరకు ఎన్ని ఎక్కువ పదాలు వింటే.. ఆ తర్వాత భాషా నైపుణ్యం అంత మెరుగ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పిల్లలతో మనం ఎంత ఎక్కువ లేదా తక్కువ మాట్లాడినా భవిష్యత్తు విద్యాసాధనపై అది శాశ్వత ప్రభావం చూపగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇక రోజువారీ మాట్లాడే భాష కంటే రాతపూర్వక భాష విస్తృత, సూక్ష్మ, వివరణాత్మక పదజాలాన్ని కలిగి ఉంటుంది కాబట్టి పుస్తక జ్ఞానం పిల్లలకు విస్తృతమైన పరిధిని, వ్యక్తీకరణ లోతును పెంచడంలో సాయపడుతుంది.

ప్రీ స్కూల్

పిల్లల ప్రారంభ భాషానుభవం వారి భవిష్యత్ విజయానికి ప్రాథమికమైనదిగా పరిగణించబడుతున్న నేపథ్యంలో.. అధికారిక విద్య ప్రారంభించకముందే పిల్లలకు ప్రాథమిక అక్షరాస్యతా నైపుణ్యాల బోధన సర్వసాధారణంగా మారింది. నాలుగేళ్లకు ముందే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం వల్ల పిల్లలు మరింత రాణిస్తారని భావిస్తున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలకు ప్రైవేట్ కోచింగ్, ప్లే స్కూల్స్ ద్వారా చదువు చెప్పిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల కిందట ప్లే-బేస్డ్(ఆటల ఆధారిత) విధానంలో అక్షరాభ్యాసం మొదలయ్యేది. కానీ కాలక్రమేణా స్కూల్ కరిక్యులమ్‌లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా పోటితత్వం పెరిగి ఇప్పుడు మూడేళ్లకే పలకాబలపం పడుతున్నారు. సరదా సరదా ఆటలతో నేర్పాల్సిన విద్యను భారంగా ఒత్తిడి మధ్యన అందిస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.


పఠన ప్రమాణాలు

విద్యా విధానంలో భారీ మార్పులు రావడంతో విద్య వ్యవస్థ పనితీరు, పురోగతిని కొలిచేందుకు కొన్ని దేశాలు ప్రామాణిక పరీక్షలను ప్రోత్సహించాయి. ఈ క్రమంలో పిల్లలు ఆశించిన పఠన ప్రమాణాన్ని చేరుకుంటున్నారో లేదో తనిఖీ చేసేందుకు పాఠశాలలో చేరిన రెండో ఏడాది(వయస్సు 5-6) పరీక్ష పెడతారు. ఈ టెస్ట్‌పై విమర్శకులు వ్యతిరేకత చూపిస్తున్నా.. ఏయే పిల్లలు వెనకబడ్డారో, ఎవరికి అదనపు మద్దతు అవసరమో గుర్తించేందుకు ఇలాంటి ముందస్తు పరీక్షలు సాయపడతాయని ప్రతిపాదకులు అంటున్నారు.

ఎలా బోధించాలి?

పిల్లల బోధనా పద్ధతులపై పునరాలోచన అవసరం. కథల పుస్తకాలు, పాటలు, పద్యాల ద్వారా పదాలపై ఆసక్తిని పెంచాలి. పదాల శబ్దాలను ఎంచుకునేందుకు, అలాగే వారి పదజాలం విస్తరించేందుకు ఈ పద్ధతులు సాయపడతాయి. ప్రీస్కూల్‌ వల్ల జీవితంలో తర్వాతి సాధనపై సానుకూల ప్రభావం ఉండే అవకాశమున్నా.. విద్యా నైపుణ్యాలకు అదనపు ప్రయోజనం ఏమీ ఉండదని అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంతేకాదు వయోపరిమితిని మించిన విద్యాపరమైన ఒత్తిడి దీర్ఘకాలంలో సమస్యలు కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో స్కూల్‌కు మూడేళ్లకు వెళ్లినా, ఏడేళ్లకు వెళ్లినా విద్యాపరంగా ఎటువంటి మార్పు ఉండదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. ఈ మేరకు జర్మనీ, ఇరాన్, జపాన్‌ సహా అనేక దేశాల్లో అధికారిక పాఠశాల విద్య ఆరేళ్లకు ప్రారంభమైతే.. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా వ్యవస్థలో ఒకటిగా ప్రశంసలు పొందుతున్న ఫిన్‌లాండ్‌లో మాత్రం ఏడేళ్లకు మొదలవుతోంది. వీరు వయసు విషయంలో వెనుకబడ్డా.. 15 ఏళ్ల వయస్సులో UK, US విద్యార్థుల కంటే ఫీనిష్ విద్యార్థులు పఠన గ్రహణశక్తి ఎక్కువ ఉండటం విశేషం.


ముందే ఎందుకు?

ముందస్తుగా నేర్చుకోవడం ద్వారా పఠన సామర్థ్యం మెరుగుపడకపోతే.. ప్రీస్కూల్ ఎందుకనే సందేహం అందరిలోనూ ఉదయిస్తుంది. నిజానికి పిల్లలు పాఠశాల విద్యను ప్రారంభించినప్పుడు లేదా చదవడం నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు వారి ఫౌండేషన్ స్కిల్స్ పరంగా చాలా భిన్నంగా ఉంటారు. అందువల్ల నాలుగు లేదా ఐదు/ఆరు సంవత్సరాల వయసులో చదవడం ప్రారంభించాలా? వద్దా? అనే పట్టింపు అవసరంలేదనే వాదన కూడా ఉంది. మొత్తానికి పరుగెత్తడం వల్ల ప్రయోజనం లేనప్పుడు పిల్లల బాల్యానికి స్వేచ్ఛనిస్తూనే విద్యను కొనసాగించడం ఉత్తమ పద్ధతిగా చెప్పొచ్చు.


Next Story

Most Viewed