సిరిసిల్ల మున్సిపల్‌లో అసలేం జరుగుతోంది..?

by Ratna Kumari |

జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీ గత కొద్ది రోజులుగా రాజకీయ, పరిపాలనా చర్చలకు కేంద్రబిందువుగా మారింది.

సిరిసిల్ల మున్సిపల్‌లో అసలేం జరుగుతోంది..?
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీ గత కొద్ది రోజులుగా రాజకీయ, పరిపాలనా చర్చలకు కేంద్రబిందువుగా మారింది. ఒకవైపు మున్సిపల్ వైస్ చైర్మన్‌పై వరుసగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు, మరోవైపు ఇప్పటికే నమోదైన పోలీసు కేసు, తాజాగా ప్రజావాణిలో మరో ఫిర్యాదు, ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో మున్సిపల్ కమిషనర్ సమావేశమైనట్లు జరుగుతున్న ప్రచారం... ఈ పరిణామాలన్నీ కలిపి సిరిసిల్ల మున్సిపల్‌లో అసలు ఏం జరుగుతోందనే ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చాయి.

ఒకటి కాదు... రెండు ఫిర్యాదులు..

మొదట ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానంటూ రూ.1 లక్ష డిమాండ్ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే, తాజాగా సోమవారం మరో వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ, పట్టణంలో ఎల్ఈడీ షాప్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.5 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. తక్కువ వ్యవధిలో ఒకే ప్రజాప్రతినిధిపై రెండు వేర్వేరు ఆరోపణలు రావడం ఇప్పుడు సిరిసిల్ల రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. కాగా ఒక ప్రజాప్రతినిధిపై వరుసగా ఆరోపణలు రావడం వెనుక అసలు కారణాలేమిటి..? నిజంగానే అవినీతి జరిగిందా..? లేక రాజకీయంగా లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదులు చేస్తున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష వర్గాలు తమదైన కోణంలో ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం దర్యాప్తు పూర్తయిన తర్వాతే లభించనుంది.

రహస్య భేటీపై పెరుగుతున్న సందేహాలు..

ఈ పరిణామాల మధ్య మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మున్సిపల్ కమిషనర్‌తో సమావేశమైనట్లు ప్రచారం జరగడం మరింత చర్చకు దారితీసింది. ఆ సమావేశంలో బీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నాయకులు కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ అధికారిక పర్యటన షెడ్యూల్‌లో సిరిసిల్ల కార్యక్రమం లేకపోయినా, తెలంగాణ భవన్‌కు రావడం, అక్కడ కమిషనర్‌తో సమావేశమైనట్లు వార్తలు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టణ అభివృద్ధి లేదా పరిపాలనా అంశాలపై చర్చించాల్సి వస్తే అధికారిక వేదిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకుండా పార్టీ కార్యాలయంలో ఎందుకు సమావేశమయ్యారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సమావేశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు. కాగా గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం లో భాగంగా పంపిణీ చేసిన ఇండ్లలో కూడా చాలామంది కౌన్సిలర్లు చేతివాటం ప్రదర్శించారని గతంలో ఆరోపణలు ఉండగా, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రహస్య భేటీలు అధికారులతో మంతనాలు జరుగుతున్నాయా అన్న విమర్శలు కూడా వినపడుతున్నాయి.

మున్సిపల్ పాలనపై పడుతున్న ప్రభావం..

వరుస ఆరోపణలు, కేసులు, రాజకీయ ప్రచారాల మధ్య మున్సిపల్ పరిపాలనపై కూడా ప్రభావం పడుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి పనులు, ప్రజా సేవలు, పాలనా వ్యవస్థపై ఈ వివాదాల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు, ప్రచారాలు, రాజకీయ వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉన్నా, వాస్తవాలు మాత్రం అధికారిక విచారణ ద్వారానే బయటపడతాయి. పోలీసు దర్యాప్తు, సంబంధిత అధికారుల పరిశీలన అనంతరం మాత్రమే ఆరోపణల్లో నిజానిజాలు తేలనున్నాయి. అప్పటి వరకు సిరిసిల్ల మున్సిపాలిటీ చుట్టూ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఒకటే... దర్యాప్తు ఏం తేలుస్తుంది? వరుస ఆరోపణల వెనుక వాస్తవం బయటపడుతుందా? లేక ఇవన్నీ రాజకీయ ఆరోపణలుగానే మిగిలిపోతాయా? అన్నది ఇప్పుడు సిరిసిల్లలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story