నిన్ను నియంత్రించేది... లక్షల ఏళ్ల ఆదిమ జీవశాస్త్రం

by Muthe.Rajitha |

నీ చూపులు నీవు నియంత్రించవు… లక్షల ఏళ్ల ఆదిమ జీవశాస్త్రం నిన్ను నియంత్రిస్తుంది!

నిన్ను నియంత్రించేది... లక్షల ఏళ్ల ఆదిమ జీవశాస్త్రం
X

నీ చూపులు నీవు నియంత్రించవు… లక్షల ఏళ్ల ఆదిమ జీవశాస్త్రం నిన్ను నియంత్రిస్తుంది! ప్రేమైక కావ్యం అనుకునే నీ చూపుల వెనుక.. లక్షల ఏళ్ల ఆదిమ జీవశాస్త్ర రహస్యం దాగి ఉంది! కళ్ళు ఎక్కడ ఆగాలో డిసైడ్ చేసేది నీ మనసు కాదు.. నీ లోపల రన్ అవుతున్న ఎవల్యూషనరీ కోడింగ్!

ఒకప్పుడు "చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము" అంటూ ప్రేమను ఒక కావ్యంలా పాడుకున్నాం. కాలం మారింది. ఇప్పుడు "నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్" అంటూ పచ్చిగా, సూటిగా పాడుకుంటున్నాం. పాటల్లో వచ్చిన ఈ మార్పు పైపైన కనిపిస్తున్న భాషా భేదం కాదు. అది మన లోపల ఉన్న ఆదిమ ప్రవృత్తికి అద్దం పడుతోంది. ప్రేమ, ఆకర్షణ అనగానే మనం ఒక అద్భుతమైన, పవిత్రమైన అనుభూతి అనుకుంటాం. కానీ దాని వెనుక లక్షల ఏళ్ల జీవశాస్త్ర పరిణామం దాగి ఉంది. మన మనసుకు నచ్చింది అనుకునే ప్రతి విషయం వెనుక, మన మెదడులో ఎప్పుడో రాసి పెట్టిన ఒక పాత సాఫ్ట్‌వేర్ రన్ అవుతూనే ఉంటుంది. ఈ శారీరక ఆకర్షణల వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో లోతుగా చూద్దాం.

కళ్ళ వెనుక దాగున్న కోడింగ్.. చూపుల శాతం వెనుక సైన్స్..

మనుషులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు కళ్ళు ఎక్కడ ఆగుతాయి? ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. ఇన్స్టింక్ట్ అనబడే ఆదిమ ప్రేరణలు మన చూపులను నియంత్రిస్తాయి. దీన్ని ఎవల్యూషనరీ బయోలజీ ఆధారంగా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

పురుషుడి చూపు – జీవసంబంధమైన లెక్కలు....

ఒక పురుషుడు స్త్రీ వైపు చూసినప్పుడు అతని చూపు ఎక్కువగా ఆమె శరీరంపై కొన్ని ప్రత్యేక భాగాలపైనే కేంద్రీకృతమవుతుంది. దీనికి పూర్తి శారీరక, పరిణామ క్రమ కారణాలు ఉన్నాయి. నడుము, పిరుదుల భాగం (55%)... దీన్ని సైన్స్ భాషలో వేస్ట్ టు హిప్ రేషియో (Waist-to-Hip Ratio) అంటారు. సన్నని నడుము, వెడల్పయిన తుంటి భాగం ఉండటం అనేది ఆమె శారీరక ఆరోగ్యాన్ని, ఎక్కువ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని సూచిస్తుంది. సులభంగా ప్రసవం చేయగలదు అనే సంకేతాన్ని పురుషుడి సబ్‌కాన్షియస్ మైండ్ క్షణాల్లో గుర్తించేలా ఈ చూపు డిజైన్ చేయబడింది. చాతి భాగం (35%)... ఇది స్త్రీ యవ్వనానికి, ఆమెలో ఉండే ఈస్ట్రోజెన్ హార్మోన్ల సమతుల్యతకు బలమైన సంకేతం. పుట్టబోయే బిడ్డకు పాలు ఇవ్వగల సామర్థ్యాన్ని ఇది చూపిస్తుంది. ముఖం (10%), కాళ్ళు (5%)... ముఖం అనేది జన్యుపరమైన ఆరోగ్యాన్ని, ఆమె వయసును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. మగవారిలో సంతానాన్ని పొందడానికి పెట్టే పెట్టుబడి, సమయం తక్కువ కాబట్టి, దృశ్య సంకేతాల ద్వారా ఆరోగ్యవంతమైన భాగస్వామిని త్వరగా ఎంచుకునేలా వారి మైండ్ ట్యూన్ అయింది.

స్త్రీల చూపు – రక్షణ, బలం వెతుకులాట...

మరి స్త్రీలు ఒక పురుషుడిని చూసినప్పుడు వారి చూపు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి: పొత్తికడుపు, సిక్స్ ప్యాక్ (75%)... ఒక పురుషుడి శారీరక దృఢత్వం, అతనిలో ఉండే టెస్టోస్టెరాన్ స్థాయిలు అతని పొత్తికడుపు భాగం ద్వారా తెలుస్తాయి. పూర్వ కాలంలో బలమైన పురుషుడు మాత్రమే వేటాడగలడు, శత్రువుల నుండి, క్రూర జంతువుల నుండి రక్షణ ఇవ్వగలడు. ఆ పాత నమ్మకం ఇప్పటికీ స్త్రీ మెదడులో బలంగా ఉంది. చాతి, భుజాలు (20%).... వెడల్పయిన భుజాలు, విశాలమైన చాతి శారీరక బలానికి ప్రతీకలు. ఇవి ఒక నమ్మకాన్ని, భద్రతను ఇస్తాయి. ముఖం (5%).... ముఖంలో ఉండే బలమైన దవడ ఎముక (Jawline) అతని రోగనిరోధక శక్తికి, అధిక టెస్టోస్టెరాన్‌కు సంకేతం. స్త్రీలు గర్భం దాల్చడం, ప్రసవం, పాలివ్వడం లాంటి ఎంతో శారీరక, మానసిక పెట్టుబడి పెడతారు. అందుకే వారికి రక్షణ, వనరులు సమకూర్చగల బలమైన భాగస్వామి అవసరం.

ఆధునిక జీవన చిత్రం.. సంక్లిష్టమైన ఆకర్షణ...

అయితే, మనం ఇంకా అడవుల్లో లేము. ఆధునిక సమాజంలో బతుకుతున్నాం. అందుకే ఈ రోజుల్లో ఆకర్షణ అనేది ఒకే ఒక అంశం మీద ఆధారపడి లేదు. ఇది చాలా బహుముఖమైనది. ప్రాథమిక శారీరక ప్రేరణలు అలాగే ఉన్నా, వాటిపై మరికొన్ని కొత్త సామాజిక, మానసిక పొరలు ఏర్పడ్డాయి. వ్యక్తిగత అభిరుచులు, మనస్తత్వాలు... ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఒకరికి ఒకరి చిరునవ్వు నచ్చితే, మరొకరికి వారి కళ్ళలో ఉండే లోతు నచ్చుతుంది. మాట్లాడే విధానం, హాస్యచతురత, అవతలి వారిని ఆదరించే గుణం ఇప్పుడు ఆకర్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

సంస్కృతి, సామాజిక నేపథ్యం....

భారతీయ సంస్కృతిలో కుటుంబ విలువలు, సామాజిక స్థితి, చదువు, సంస్కారం వంటి వాటికి పెద్ద పీట వేస్తాం. ఆధునిక నగరాల్లో కెరీర్, ఆర్థిక స్వాతంత్ర్యం, జీవనశైలి వంటివి ఆకర్షణను శాసిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం వల్ల మొదటి చూపులోనే ఒకరి లైఫ్‌స్టైల్ చూసి ఇష్టపడటం ఎక్కువైంది. బుద్ధి, మానసిక సామర్థ్యం... తెలివితేటలను చూసి ఆకర్షితులయ్యే వాళ్ళను 'శాపియోసెక్సువల్స్' అంటారు. శరీర ఆకృతితో సంబంధం లేకుండా, అవతలి వ్యక్తి ఆలోచనా విధానం, జ్ఞానం చూసి ప్రేమలో పడే వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. దీర్ఘకాలిక సంబంధాల్లో మానసిక సమతుల్యత, సమాన విలువలు చాలా ముఖ్యమవుతాయి.

జీవశాస్త్రం నుండి ఆత్మ చైతన్యం వైపు

చివరగా ఆలోచిస్తే, ఆకర్షణ అనేది ప్రకృతి మనకు అమర్చిన ఒక అద్భుతమైన వలయం. పురాతన కాలపు జీవసంబంధమైన అవసరాలు, ఆధునిక కాలపు మానసిక అవసరాల కలయికే ఈ నాటి ప్రేమ. శరీరం వైపు లాగేది ఒక శక్తే కావచ్చు, కానీ మనసును ముడివేసేది మాత్రం మరొక ఉదాత్తమైన భావన. జీవశాస్త్రం మనకు పునాదిని ఇస్తే, మన చైతన్యం ఆ పునాదిపై ఒక అందమైన భవనాన్ని నిర్మిస్తుంది. జంతు ప్రవృత్తి నుండి మానవత్వంలోకి, అక్కడి నుండి ఆత్మీయతలోకి సాగే ప్రయాణంలో ఈ చూపులు, ఈ కలవరాలు అన్నీ ఒక చిన్న భాగాలు మాత్రమే. ప్రకృతి పరిణామ క్రమాన్ని గౌరవిస్తూనే, బాహ్య రూపాలను దాటిన అంతర్గత ఆత్మీయతను అందుకోవడమే నిజమైన మానవ వికాసం.

మరి ఈ సైన్స్ నిజమని మీరు అనుకుంటారా?

డాక్టర్ నంబూరి చంద్రశేఖర్

రేడియాలజిస్టు

93939 90399

Next Story