అన్నదాతకు అప్పుల బాధ.. 'భరోసా'పై ఆశలు వదులుకున్న రైతులు

by Muthe.Rajitha |

ఖరీఫ్ సీజన్ ​ప్రారంభమవుతుండటంతో పంట పెట్టుబడుల కోసం అన్నదాతలు అప్పుల కోసం పడరాని కష్టాలు పడుతున్నారు.

అన్నదాతకు అప్పుల బాధ.. భరోసాపై ఆశలు వదులుకున్న రైతులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖరీఫ్ సీజన్ ​ప్రారంభమవుతుండటంతో పంట పెట్టుబడుల కోసం అన్నదాతలు అప్పుల కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. గతంలో ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందనే నమ్మకంతో పెద్దగా అప్పుల కోసం తిప్పలు పడలేదు. కానీ గత యాసంగి సీజన్‌లో రెండు ఎకరాలకే సహాయం అందడంతో ఈ ఖరీఫ్ ​సీజన్‌కు​ అసలు రైతు భరోసా వస్తుందా? లేదా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మకోవడం కంటే వడ్డీ వ్యాపారులను నమ్ముకుంటే పంటలు ఎంతో కొంత సాగు చేయవచ్చని అన్నదాతలు భావిస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ​ప్రభుత్వం పంపిణీ చేసినట్టు ప్రతి సీజన్ ​పెట్టుబడి ఒకేసారి ఖాతాలో జమచేస్తే బాకీలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఈసారి రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. అయితే వీటికి ముందుగానే అధిక పెట్టుబడి కావాల్సివుండగా అప్పులు చేయక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంక్‌ల చుట్టూ చక్కర్లు

ధరలు పెరుగుతాయనే భయంతో ఇప్పటికే కొన్ని జిల్లాలో రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. మరికొందరు రైతులు ప్రభుత్వ బ్యాంకుల వద్ద పంట రుణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వానాకాలం సీజన్ వస్తుందని గతంలో రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించామని, ఈ సీజన్‌కు కూడా ఇవ్వాలని కోరుతూ బ్యాంక్‌ల చుట్టు తిరుగుతున్నారు. అప్పు పుడితేనే పంటలు వేసే పరిస్థితి వచ్చిందని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో 35 లక్షల ఎకరాల్లో వరి, 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 45 లక్షల ఎకరాల్లో పత్తి, 9 లక్షల ఎకరాల్లో సోయా చిక్కుడు సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. దీంతో వరి, మొక్కజొన్న, పత్తి ప్యాకేట్లు, సోయా చిక్కుడు విత్తనాలు జిల్లాలకు సరఫరా చేస్తోంది. అదే విధంగా యూరియా కూడా గత మూడు నెలలకు సంబంధించి 4.10 లక్షల మెట్రిక్​టన్నులు కేంద్రం సరఫరా చేసింది. దానిని అధికారులు జిల్లాల గోదాములకు తరలించారు.

విత్తనాలు, ఎరువుల భారం

ఈ ఏడాది ఊహించని విధంగా యూరియా ధరలు భారీగా పెరిగాయి. వీటికి తోడు విత్తన కంపెనీలు కూడా తామేమి తక్కువ కాదని 20 శాతం ధరలు పెంచాయి. దీంతో గతం కంటే పెట్టుబడి డబుల్ అయింది. కూలీల సంఖ్య తగ్గుతుండటంతో ఉన్న కూలీలకే డబుల్​కూలీ ఇవ్వాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే.. తీరా పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగి అన్నదాతలు అప్పులు పాలవుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భావిస్తే వారి మాటలు ప్రచారానికే పరిమితమయ్యాయి. ధాన్యం పండిస్తే కేంద్రాల వద్ద నిర్వహకుల దోపిడి, కూరగాయలు, పండ్లు, అకు కూరలు పండిస్తే మార్కెట్​సదుపాయం లేక మధ్య దళారులకే అమ్మే దుస్ధితి. ఎటు చూసినా అన్నదాతకు కష్టాలే తప్పా ఆనందపడే రోజులు కనిపించట్లేదు.

వడ్డీ వ్యాపారుల దోపిడి

పంట పెట్టుబడుల కోసం తమను ఆశ్రయిస్తున్న రైతులను వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలతో దోచుకుంటున్నారు. 5 నుంచి 8 శాతం వడ్డీకి ఒప్పుకుంటేనే ఇస్తామని పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు. అంత ఇవ్వలేమంటున్న వారిని పండిన పంట తమకే అమ్మాలనే షరతులు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పంట సీజన్​ ముంచుకొస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులు డిమాండ్​ చేసినంతా చెల్లింపులకు ఒప్పుకుంటున్నారు. కొందరు వ్యాపారులు భూములకు సంబంధించిన పత్రాలు తాకట్టు పెట్టుకొని అప్పులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. సన్న, చిన్న కారు రైతులకే బాకీల బాధలు అధికంగా ఉండగా వీరికి ప్రభుత్వం రాయితీలు, పెట్టుబడి సహాయం పంపిణీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారికి ఎలాంటి భూమికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో బ్యాంకులు క్రాప్ ​రుణాలు ఇవ్వవు. వడ్డీ వ్యాపారులు వారికి అప్పులు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో దీంతో ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పటికే రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులు మాఫీ కోసం అధికారులు చుట్టు తిరుగుతున్నారు. ప్రభుత్వం గతేడాది మాఫీ చేయకున్నా.. ఈ సంవత్సరంలోనైనా రుణమాఫీ చేస్తుందనే ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

Next Story