రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా ఎలాన్ మస్క్ పేరిట కాల్స్

by Muthe.Rajitha |

సైబర్ నేరగాళ్లు ప్రపంచ కుబేరుల పేర్లు వాడి ఓ రిటైర్డ్ డాక్టర్ దగ్గర భారీగా డబ్బు గుంజిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా ఎలాన్ మస్క్ పేరిట కాల్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎంత కట్టడి చేసినా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. వారి మోసాలకు నిన్నా మొన్నటి వరకు బ్యాంకు అధికారులమని, పోలీసులమని, కస్టమ్స్ ఆఫీసర్స్ అని మాత్రమే ఫోన్లు చేసి బురిడీ కొట్టించేవారు. ఇపుడు ఏకంగా ప్రపంచ కుబేరుల పేర్లు వాడి ఓ రిటైర్డ్ డాక్టర్ దగ్గర భారీగా డబ్బు గుంజిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏఐ సహాయంతో క్రియేట్ చేసిన నకిలీ వీడియోలను నమ్మి ఏకంగా రూ.10.11 లక్షలు సమర్పించుకున్నారు. చివరకు కుటుంబ సభ్యుల అప్రమత్తతతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పేట్‌బషీరాబాద్‌కు చెందిన డాక్టర్‌ కృష్ణయ్య(70) ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. గతేడాది మార్చిలో కొందరు సైబర్ నేరగాళ్లు ఆయనకు ఫోన్ చేసి, తాము స్పేస్‌ఎక్స్‌ అధిపతి ఎలాన్‌మస్క్, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌లమంటూ పరిచయం చేసుకున్నారు. తాము అడిగే పజిల్స్‌ పూర్తి చేస్తే ఉచితంగా ఒక 'టెస్లా కారు'తో పాటు.. బంగారం, నగదుతో కూడిన సంచిని రివార్డుగా ఇస్తామని నమ్మించారు.

ఏఐ వీడియోలతో నమ్మబలికారు..

వైద్యుడికి మరింత నమ్మకం కలిగించేందుకు సరకు రవాణా విమానాల్లో టెస్లా కార్లను లోడ్‌ చేస్తున్నట్లు ఉన్న కొన్ని ఏఐ (AI) జనరేటెడ్ వీడియోలను పంపారు. ఆ పజిల్స్‌ను కృష్ణయ్య పూర్తి చేయడంతో.. బహుమతులన్నీ విమానంలో ఇండియాకు బయలుదేరాయని నిందితులు నమ్మించారు. అయితే ఆ బహుమతులు డెలివరీ కావాలంటే ముందస్తుగా కస్టమ్‌ క్లియరెన్స్‌ ఛార్జీలు, డెలివరీ రుసుము, బీమా, దిగుమతి సుంకం, ఇంధన వ్యయం చెల్లించాలంటూ మెలికపెట్టారు. దీంతో ఆ బహుమతులు నిజంగానే వస్తున్నాయని నమ్మిన బాధితుడు, నిందితులు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాల్లోకి విడతల వారీగా డబ్బు బదిలీ చేయడం ప్రారంభించారు. కుటుంబ సభ్యులు ఇది సైబర్ మోసమని హెచ్చరించినా ఆయన వినలేదు. రోజురోజుకూ డబ్బు డిమాండ్ పెరుగుతుండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. వెంటనే అప్రమత్తమై బాధితుడి ఫోన్ నంబర్లను, సదరు బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయించారు. అనంతరం బాధితుడి కుమారుడు సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story