పడిపోతున్న అభిషేక్ ఫామ్.. కోచ్‌లలో భిన్నాభిప్రాయాలు

by Muthe.Rajitha |

టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనపై కోచ్‌లు, మాజీ కెప్టెన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పడిపోతున్న అభిషేక్ ఫామ్.. కోచ్‌లలో భిన్నాభిప్రాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : వరల్డ్ కప్‌లో వరుసగా విఫలమవుతున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై జట్టులో చర్చలు కొనసాగుతున్నాయి. భారీ షాట్లు ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే క్రికెటర్లలో అభిషేక్ శర్మ ముందుంటాడు. అయితే ఇటీవల అతని ఆటతీరు పూర్తిగా తగ్గిపోవడంతో పలువురు మాజీ క్రికెటర్లు, కోచ్‌లు అభిషేక్ ఆటతీరుపై రకరకాల చర్చలు చేయడమే కాకుండా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఒక బౌండరీతో తన 'డక్ఔట్'ల పరంపరను ముగించాడు. అయితే 15 పరుగులకే పరిమితమై మళ్లీ నిరాశపరిచాడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

కోచ్‌ల భిన్నాభిప్రాయాలు

గత రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్-స్పిన్నర్లకు ఇబ్బంది పడ్డ అభిషేక్, తాజా మ్యాచ్‌లో పేసర్ల వ్యూహాలకు కూడా చిక్కుకున్నాడు. వెడల్పుగా, నెమ్మదిగా వేసిన బంతులకు పెద్ద షాట్లు ఆడే ప్రయత్నంలో చాలా కష్టపడ్డాడు. దీనిపై స్పందించిన మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. "ముందే భారీ షాట్లకు ప్రయత్నించకుండా ఒక సింగిల్ తీసుకుని ఖాతా తెరవాలి. నాలుగు డాట్ బాల్స్ వచ్చినా పరవాలేదు. ఒత్తిడిలో పెద్ద షాట్లు ఆడకూడదు" అని సూచించారు.

అలాగే భారత కోచింగ్ స్టాఫ్‌లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ మాట్లాడుతూ.. వరల్డ్ కప్‌కు ముందు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అతని ప్రిపరేషన్ దెబ్బతిన్నదని తెలిపారు. "మేము కోరుకున్న స్థాయికి అతను ఇంకా చేరలేదు. వరుసగా మూడు సున్నాలు సాధిస్తే అది ఆటగాడిపై ప్రభావం చూపుతుంది. నెట్స్‌లో మంచి సంకేతాలు కనిపించాయి. కోచింగ్ సిబ్బందిగా అతన్ని తిరిగి ఫామ్‌లోకి తీసుకురావడం మా బాధ్యత" అని చెప్పారు.

ఇక బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. "ఇది అంత పెద్ద సంక్షోభం కాదు. ప్రతి ఆటగాడికి 2–3 మ్యాచ్‌ల స్లంప్ వస్తుంది. ఇలాంటి సమయంలో టెక్నిక్ మార్చాలని ప్రయత్నిస్తే మరిన్ని సందేహాలు కలుగుతాయి. అతను బంతిని బాగా గమనించి తన ఇన్నింగ్స్‌ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి" అని అన్నారు.

ఇక ప్రముఖ కోచ్ జుబిన్ భారుచా.. ఈ ఫార్మాట్‌లో సహజంగా స్థిరత్వం అనేది ఉండదు. "ఒక్కరోజు సున్నా కొట్టినా, మరుసటి రోజు శతకం బాదడం కూడా సాధ్యమే. కాబట్టి 'ఫామ్' అనే భావనను అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. భయంలేని మనస్తత్వంతో అవకాశాన్ని ఉపయోగించుకోవాలి" అని పేర్కొన్నారు.

వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన అభిషేక్ శర్మ, రాబోయే మ్యాచ్‌ల్లో తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. భారత జట్టు సెమీ ఫైనల్ కు చేరాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ అంత్యంత కీలకమైనది. జట్టు విజయాలు సాధించాలంటే అభిషేక్ శర్మ ఆటతీరు కూడా చాలా ముఖ్యం.

Next Story