నోటీసులు ఇచ్చారా..? దాచారా..?

by Jakkula.Mamatha |

ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న భారీ అక్రమ కట్టడం వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

నోటీసులు ఇచ్చారా..? దాచారా..?
X

దిశ, పేట్ బషీరాబాద్: ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న భారీ అక్రమ కట్టడం వ్యవహారంలో రెవెన్యూ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ ఆక్రమణపై స్వయంగా కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో పేట్ బషీరాబాద్ సర్వే నంబర్ 5లో జరుగుతున్న నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నోటీసులు ఇవ్వాలని కొన్ని రోజుల క్రితమే ఆదేశించినా.. కింది స్థాయి సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు బీజం వేస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ మాటల తీరు, నోటీసుల జారీలో ఆయన వ్యవహరించిన శైలిపై అనుమానాలు కలగక మానదు.

సార్.. “సర్” లో బిజీ.. అంటూ దాటవేత

సర్ విధులు రాకముందే సర్వే నెంబర్ 5 అంశంలో నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు రెవెన్యూ అధికారులు. అక్రమ కట్టడం పై నోటీసులు ఇచ్చి పనులు నిలుపుదల చేయించాల్సిన ఆర్ఐ.. రోజులుగా నోటీసులు ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పలుమార్లు ఆయనకు ఫోన్ చేసినప్పటికీ, తాను “సర్” విధుల్లో బిజీగా ఉన్నానని చెబుతూ దాటవేస్తూ వచ్చారు. పలుమార్లు ఈ అంశం పై వివరణ కోసం ప్రయత్నించగా బిజీగా ఉన్నా అని మళ్ళీ మాట్లాడతానని చెప్పుకొచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం నోటీసులు ఇచ్చేశానని ఆర్ఐ చెబుతున్నారు. అయితే, ఇచ్చిన నోటీసును బహిర్గతం చేయడానికి మాత్రం వెనకడుగు వేశారు.

కాపీ అడిగితే జంకుతున్నారెందుకు?

నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అయితే, ఆ కాపీని చూపించడానికి ఆర్ఐ ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. నోటీసు కాపీని అడిగితే.. ఎమ్మార్వో సార్‌ను అడగాలంటూ ఆర్ఐ దాటవేస్తున్నారు. కాపీని బయట పెట్టడానికి అధికారి ఎందుకు జంకుతున్నారు? అసలు నోటీసులు నిజంగానే ఇచ్చారా? లేక పై అధికారుల కళ్లుగప్పేందుకు ఇచ్చినట్లుగా చెబుతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన రెవెన్యూ అధికారి ఇలా దాపరికానికి పోవడం పలు విమర్శలకు దారి తీస్తోంది.

ఆర్ఐ వింత వాదన..

నోటీసు కాఫీ బహిర్గతం చేయడానికి ఇబ్బంది ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వచ్చినప్పుడు ఆర్ఐ మాట్లాడిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఆ అంశం పబ్లిక్ కాదు అంటూ, ప్రభుత్వ భూముల కబ్జాలపై స్పందిస్తూ "గవర్నమెంట్ అంటే పబ్లిక్ కాదు.. అది గవర్నమెంట్ ది.. పబ్లిక్ ది ఎట్లా అవుతుంది?" అంటూ ఆర్ఐ వింతగా వాదం చేశారు. ప్రభుత్వ భూములు, నిధులు, వనరులు అన్నీ అంతిమంగా ప్రజలందరి ఉమ్మడి సంపద. ప్రభుత్వం కేవలం వాటికి సంరక్షకురాలిగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 లోని సెక్షన్ 74 (భారతీయ సాక్ష్య అధినియం, 2023) ప్రకారం, ప్రభుత్వ అధికారుల శాసన, న్యాయ, కార్యనిర్వాహక హోదాలో చేసిన అధికారిక చర్యలు లేదా వాటికి సంబంధించిన రికార్డులు పబ్లిక్ డాక్యుమెంట్లుగా పరిగణించబడతాయి.

అందువల్ల, వారు అధికారిక హోదాలో జారీ చేసే ఉత్తర్వులు, నోటీసులు, ప్రొసీడింగ్స్, ఇతర అధికారిక రికార్డులు సాధారణంగా పరిధిలోకి వస్తాయి. మరి పెట్ బషీరాబాద్ సర్వేనెంబర్ ఐదు ప్రభుత్వ భూమి వ్యవహారంలో ఒక ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారానికి సంబంధించిన నోటీసును దాచటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారంపై పై అధికారులు దృష్టి సారించి, అక్రమ కట్టడం పై తీసుకున్న చర్యలను పారదర్శకంగా బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story