ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు : మంత్రి లక్ష్మణ్ కుమార్

by Batti.Sumithra |

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా ప్రజల వద్దకే చేరవేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.

ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు : మంత్రి లక్ష్మణ్ కుమార్
X

దిశ, పెగడపల్లి : ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని నేరుగా ప్రజల వద్దకే చేరవేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి నియోజకవర్గ ప్రజలు సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం కరీంనగర్ వరకు వెళ్లాల్సి వచ్చేదని, అయితే ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రజల వద్దకే నేరుగా సంక్షేమ పథకాలను అందజేస్తోందని తెలిపారు.

ప్రతి పేదవాడి కల అయిన సొంతింటి నిర్మాణాన్ని నెరవేర్చడం తన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగా మొదటి విడతలో మండలానికి 499 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. రెండో విడతలో జూలై నాటికి అర్హులైన మరింత మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మపురి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా మండలానికి రూ.2.50 కోట్ల వ్యయంతో సీసీ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. అలాగే రూ.11 కోట్ల నిధులతో కీచులాటపల్లి గ్రామం నుంచి ధర్మారం మండలం మల్లాపూర్ వరకు డబుల్ రోడ్డును నిర్మిస్తున్నట్లు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని రహదారుల నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా మండల వ్యాప్తంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి, మండలాన్ని సస్యశ్యామలం చేయడం తన బాధ్యత అని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్, ఎంపీఓ శశికుమార్, డిప్యూటీ తహసీల్దార్ శిరీష, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, నందగిరి సింగిల్ విండో చైర్మన్ కర్ర భాస్కర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ఓరుగలి అరుణ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడారి తిరుపతి, సర్పంచులు మోకినపెల్లి గోపాల్, అయితరవేణి లక్ష్మణ్, వెల్మ బలరాం రెడ్డి, రమేష్ నాయక్, ఉపసర్పంచులు కుంచె రాజేందర్, శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చెట్ల కిషన్, లింగంపల్లి మహేష్, నాయకులు ఓరుగలి శ్రీనివాస్, సంధి మల్లారెడ్డి, పూసల తిరుపతి, తడగొండ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story