బుగ్గపాడు భూముల పై దుష్ప్రచారం తగదు: టీజీఐఐసీ

by Malleboina Mahesh |

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులపై దుష్ప్రచారం వద్దు.. రూ.515 కోట్ల పెట్టుబడి, 3వేల ఉద్యోగాల కోసమే ధర సవరణ: టీజీఐఐసీ స్పష్టత!

బుగ్గపాడు భూముల పై దుష్ప్రచారం తగదు: టీజీఐఐసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖమ్మం జిల్లా బుగ్గపాడు ఫుడ్ పార్క్ లో భూ కేటాయింపు పూర్తి పారదర్శకంగా జరిగిందని.. ఇందులో ఎటువంటి ఒత్తిళ్లకు అవకాశమే లేదని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వెల్లడించింది. దీపక్ నెక్ట్స్ జెన్ ఫీడ్స్ సంస్థకు కారు చౌకగా కేటాయింపులు జరిగాయని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తమని తెలిపింది. టీజీఐఐసీ ఉమ్మడి ఖమ్మం జిల్లా జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుగ్గపాడులోని 203.20 ఎకరాల ఫుడ్ పార్కు ఏర్పాటు చేసి ఏళ్లు గడిచినా పరిశ్రమలు ముందుకు రాకపోవడంతో పెట్టుబడులను ప్రోత్సహించి, ఉపాధి అవకాశాలను పెంచేందుకే ధర తగ్గించాల్సి వచ్చిందని తెలిపారు.

గతంలో ఎకరం ధర రూ.51 లక్షలుగా నిర్ణయించగా.. స్పందన కరువవడంతో ఏప్రిల్ 22, 2022లో రూ.35.75 లక్షలకు సవరించడం జరిగిందని పేర్కొన్నారు. అప్పటికీ పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకు రాలేదని.. దీంతో దీపక్ నెక్ట్స్ జెన్ ఫీడ్ పరిశ్రమ రూ.515 కోట్లతో ఫీడ్, ఇంటిగ్రేటెడ్ అక్వా ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి 72 ఎకరాల భూమి కేటాయించాలని అభ్యర్థించిందని వెల్లడించారు. అయితే.. రూ.35.75 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు తీవ్ర ఆర్థిక భారం అవుతుందని తెలపడంతో రూ.25 లక్షలకు హేతుబద్ధీకరించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,040 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆ సంస్థ తెలిపిందని పేర్కొన్నారు. దీపక్ నెక్ట్స్ జెన్ డీపీఆర్‌లో పేర్కొన్న మేరకు రెండేళ్లలో పెట్టుబడులు పెట్టకపోయినా, ప్రకటించిన మేరకు ఉపాధి కల్పించకున్నా భూమిని వెనక్కి తీసుకునే వెసులుబాటు తమకు ఉన్నదని తెలిపారు.

ఒప్పందంలో ఈ అంశాలన్నీ స్పష్టంగా పేర్కొన్నామని.. భూ కేటాయింపు ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికనే జరిగిందని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరచి అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం భూమి ధర తగ్గించాల్సివచ్చింది తప్ప ఎవరికో ప్రయోజనం కల్పించడం కోసం కాదని పేర్కొన్నారు. ప్రైస్ ఫిక్సేషన్, ఇన్ ఫ్రా కమిటీ సిఫార్సుల మేరకు ధరను నిర్ణయించామని.. ఇది పూర్తిగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న పారిశ్రామిక భూములను వినియోగంలోకి తెచ్చే సంకల్పంతోనే కేటాయింపులు జరిగాయని.. ఫుడ్ పార్క్‌లో మౌలిక సదుపాయాల కోసం రూ.90.80 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కొన్ని భవనాలను సైతం నిర్మించామని.. అవన్నీ నిరుపయోగంగా మారడంతో పరిశ్రమలను ప్రోత్సహించే లక్ష్యంతోనే ధరను సవరించినట్లు వెల్లడించారు.

Next Story