- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీఎం కిసాన్’లో అనర్హుల ఏరివేత
పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత! తెలంగాణలో 32 వేల మందికి సాయం కట్ చేయనున్న కేంద్రం. ఐటీ కట్టేవారు, భూమి విక్రయించిన వారే టార్గెట్.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. 2018-19లో ఈ స్కీమ్ ను ప్రారంభించగా, ఇప్పటివరకు 21వ విడతలో రూ.14,237.05 కోట్ల ధనాన్ని రైతుల ఖాతాలో జమ చేసినట్టు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఎకరా భూమిని యూనిట్‌గా భావించి ఆర్థిక సాయం అందజేస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనలో మాత్రం కేవలం రైతును మాత్రమే ఒక యూనిట్‌గా తీసుకొని రూ.ఆరువేల చొప్పున ఏడాదికి వారి బ్యాంకు అకౌంట్‌లో జమ చేస్తున్నది.
అయితే కొందరు అనర్హులు లబ్ధి పొందుతుండటం తో ప్రభుత్వం ఏరివేత ప్రక్రియను ప్రారంభించింది. 21వ విడతలో 30.08 లక్షల మంది ఖాతాలో కేంద్రం జమ చేయగా వచ్చే దఫాలో 32 వేల మంది పేర్లు తొలగించనున్నారు. చాలామంది భూముల అమ్మకాలు, ఆదాయపన్ను చెల్లిస్తూ గుట్టుగా ఏడాదికి రూ.ఆరు వేల నగదు దర్జాగా పొందుతున్నారు. వారిపై ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఏటా 10 శాతం మంది లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
పెరిగిన సంఖ్య
పీఎం కిసాన్ యోజన పథకం ప్రారంభంలో 20.28 లక్షల మంది ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వ సాయం జమ అయింది. ఆ తర్వాత వరుసగా 10వ విడత 2021–22 డిసెంబర్ నాటికి 36.07లక్షల మందికి లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. నాటి నుంచి కేంద్రం ప్రయోజన పొందే వారి సంఖ్య పెరగడంతో ఏటా అనర్హుల జాబితా పై కన్నేసింది. 11వ విడత నుంచి అక్రమంగా తీసుకున్న వారిని గుర్తించగా 15వ విడత 28.71లక్షలకు లబ్ధిదారుల సంఖ్య పడిపోయింది. మధ్యలో పరిశీలన చేయకపోవడంతో మళ్లీ కొద్దిగా ఆ సంఖ్య పెరిగింది.
అనర్హులకు సాయం కట్..
పీఎం కిసాన్యోజన పొందే రైతులకు కచ్చితంగా ఈకేవైసీ నిబంధన పెట్టడంతో చాలా మందికి కోత పడింది. ఆధార్‌కార్డు లింక్ చేయడంతో ఆదాయ పన్ను, ఎక్కువ భూమి కలిగినవారు, కుటుంబంలో భార్యాభర్తలు పొందగా వారంతా బయటపడ్డారు. దీంతో చాలామంది రైతులు ఈకేవైసీకి ముందు రాకుండా దూరంగా ఉండటంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. గతేడాదిలో ఫార్మర్ ఐడీ చేసుకోవాలని కేంద్రం ప్రకటించడంతో ఇంకా చాలా మంది రైతులు రిజిస్టర్ చేసుకోలేదు.
ఇప్పటివరకు ఐడీ నమోదు ప్రక్రియ 70 శాతం చేరుకోలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఊరూరు తిరిగినా ఐదెకరాల లోపు రైతులే తప్ప ఆరు ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఫార్మర్ ఐడీకి ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో పది రోజులుగా వ్యవసాయ విస్తరణాధికారులు లబ్ధిదారుల జాబితాను జల్లెడ పడుతున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, మృతి చెందిన వారు, పథకం ప్రారంభంలో నగదు పొంది ఇతరులకు భూమి విక్రయించినవారు, ఐదెకరాలకు పైబడిన కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ పొందితే వారికి ఈ దఫా పీఎం కిసాన్ సాయం అందనట్లేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.






