తెలంగాణను ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం.. హార్వర్డ్ వేదికగా CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-29 03:32:11  IST  )

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఆయన ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో సందడి చేశారు.

తెలంగాణను ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తాం.. హార్వర్డ్ వేదికగా CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. తాజాగా ఆయన ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో సందడి చేశారు. హార్వర్డ్‌లోని భారతీయ విద్యార్థుల బృందం ఆహ్వానం మేరకు ఆయన క్యాంపస్‌ను సందర్శించి, భవిష్యత్ తెలంగాణ లక్ష్యాలపై వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆర్థికంగా, విద్యాపరంగా అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలను విద్యార్థులకు వివరించారు. కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధిని విస్తరింపజేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను తీసుకురావడంపై విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలను కూడా స్వీకరించారు.

కృత్రిమ మేధ (AI), డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతలో యువతకు శిక్షణ ఇచ్చి, వారిని గ్లోబల్ మార్కెట్‌కు సిద్ధం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఆర్థిక విధానాలను రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా హార్వర్డ్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల్లో చదువుతున్న తెలుగు, భారతీయ విద్యార్థులు తమ విజ్ఞానాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వెచ్చించాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణను ఒక ‘నాలెడ్జ్ హబ్’గా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




Next Story