పుష్కరాలతో ధర్మపురి ఆలయాల వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం

by Ratna Kumari |

2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి ఆలయాల చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

పుష్కరాలతో ధర్మపురి ఆలయాల వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం
X

ధర్మపురి, జూలై 14 (ఆంధ్రప్రభ) : 2027 జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురి ఆలయాల చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ధర్మపురిలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి వివిధ శాఖల అధికారులతో పుష్కరాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించిందని, ఇందులో భాగంగా ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాల అభివృద్ధికి తొలి విడతగా రూ.117 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

ధర్మపురిలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి దేవాలయ అభివృద్ధితో పాటు వీఐపీ ఘాట్ల నిర్మాణం చేపడతామని, కోటిలింగాల దేవస్థానం అభివృద్ధి, వెల్గటూరు ప్రధాన రహదారి నుంచి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే ధర్మపురిలో అమ్మ ఫంక్షన్ హాల్ నుంచి రాజారం రోడ్డు వరకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

పుష్కరాల ఏర్పాట్ల కోసం ధర్మపురికి మరో రూ.60 కోట్ల అదనపు నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలను మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి చేసి టెంపుల్ సిటీలుగా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు. ధర్మపురి మాస్టర్ ప్లాన్‌ను కూడా త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పనిచేస్తున్న అర్చకులకు వేతనాల పెంపు ఉత్తర్వులను అందజేశారు.

అనంతరం కోటిలింగాల క్షేత్రాన్ని సందర్శించి కోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ పుష్కరాల ఏర్పాట్లకు చేపట్టాల్సిన పనులను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజగౌడ్, ఆర్డీవో మధుసూదన్ గౌడ్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో కృపాకర్, ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, ఆలయ చైర్మన్ పూదరి రమేష్, ఈవోలు శ్రీనివాస్, కాంతారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story