ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఇంటి ముట్టడికి వస్తే ఊరుకోం

by Ratna Kumari |

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం సరికాదని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి విమర్శించారు.

ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఇంటి ముట్టడికి వస్తే ఊరుకోం
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం సరికాదని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి విమర్శించారు. ఆదివారం ఆర్మూర్‌లో బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు వస్తే బీజేపీ కూడా ‘చలో అంకాపూర్’కు సిద్ధంగా ఉంటుందని అన్నారు. సోమవారం జరిగే పరిణామాలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఇంటిని ముట్టడించడం సిగ్గుచేటని అన్నారు.

అభివృద్ధి పనులపై ప్రస్తావన..

రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, 92 గ్రామాలకు 3,000 ఇళ్ల మంజూరు, ఆర్మూర్ మున్సిపాలిటీకి రూ.45 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ ప్రాజెక్టు, గల్ఫ్ కార్మికుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం, అమృత్ పథకం కింద రూ.43 కోట్ల నిధులు తీసుకురావడం, డొంకేశ్వర్ మండలానికి ఎమ్మార్వో కార్యాలయ భవనం మంజూరు చేయించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించడం ఏమాత్రం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. అవినీతికి తావులేకుండా సుమారు రూ.700 కోట్ల అభివృద్ధి పనులు నియోజకవర్గానికి తీసుకువచ్చిన ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, కాంగ్రెస్ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.

హామీలపై కాంగ్రెస్‌ను ప్రశ్నించిన బీజేపీ..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ఎన్నికల హామీల అమలులో విఫలమైందని దినేష్ కులచారి ఆరోపించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నాయకులు వస్తే, బీజేపీ కార్యకర్తలు కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి రెడ్డి నివాసాల వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గద్దె భూమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంగర్ లక్ష్మీనారాయణ, నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు యాదాల నరేష్, జ్యోతి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓం సింగ్, రూరల్ మండల అధ్యక్షుడు ఆనంద్, సంతోష్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Next Story