గోదావరి జలాలను సద్వినియోగం చేసి రైతులకు సాగునీరు అందిస్తాం

by Batti.Sumithra |

గోదావరి జలాలను సద్వినియోగం చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ & విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

గోదావరి జలాలను సద్వినియోగం చేసి రైతులకు సాగునీరు అందిస్తాం
X

దిశ, మణుగూరు : గోదావరి జలాలను సద్వినియోగం చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ & విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన గురువారం పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గోదావరి జలాలను సాధ్యమైనంత వరకు వరదల ద్వారా వచ్చిన నీటిని లేదా లిఫ్టుల ద్వారా ఇరిగేషన్ శాఖ సమన్వయంతో రైతులకు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోయినా ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజలకు సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత పాలనలో చేపట్టిన పలు నిర్ణయాల వల్ల ప్రాజెక్టుల వ్యయం అనవసరంగా పెరిగి రాష్ట్రంపై పెద్ద ఆర్థిక భారం పడిందన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఆ పరిస్థితులను సమీక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ఎల్‌నినో వంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్రం తట్టుకునే విధంగా ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, జలాశయాల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునే ఆలోచన కొత్తది కాదని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే దుమ్ముగూడెం వద్ద రాజీవ్ సాగర్ ప్రాజెక్టు రూపంలో ఈ దిశగా అడుగులు పడ్డాయని గుర్తు చేశారు. ఆ సమయంలో గోదావరి జలాలను సాగునీటి అవసరాలకు మళ్లించే లక్ష్యంతో ప్రాజెక్టును ప్రారంభించారని, ఆ ఆలోచనను మరింత విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నీటిపారుదల రంగం కీలకమని, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చన్నారు. రైతులకు స్థిరమైన సాగునీటి వనరులు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, టీజీఎన్‌పీడీసీఎల్ ఎండీ వరుణ్ రెడ్డి, పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తదితరులు పాల్గొన్నారు.

ఇరిగేషన్‌ పై గత ప్రభుత్వం షోపుటప్ చేసింది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం షోపుటప్ చేస్తూ గొప్పలు చెప్పుకునే విధంగా వ్యవహరించిందన్నారు. ఇరిగేషన్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా గతంలో అనేక సార్లు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వద్దకు రావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం తమ కమిషన్ల కోసం ప్రాజెక్టుల వ్యయాన్ని విపరీతంగా పెంచిందని, సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే తంతు కొనసాగిందన్నారు. రాష్ట్రాన్ని నడిపిస్తున్న జిల్లా ఖమ్మం జిల్లా అని, ఇద్దరు మంత్రులు ఇక్కడే ఉన్నారన్నారు. ఇరిగేషన్ పనులను తప్పకుండా పూర్తి చేస్తామని, ఉమ్మడి జిల్లాలకు గోదావరి జలాలు పుష్కలంగా పారేలా కృషి చేస్తామన్నారు. పదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టును సక్రమంగా పూర్తి చేయలేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం సూచనల మేరకు సాంకేతిక పరీక్షలు, భూగర్భ పరిశీలనలు, నిర్మాణ భద్రతా అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు. నిపుణుల నివేదికల ఆధారంగా అవసరమైన పునరుద్ధరణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత, నిర్మాణ నాణ్యత, నీటి నిల్వ సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని నిర్ణయాలు శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగానే తీసుకుంటున్నామన్నారు. సీతారామ ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌లు, బ్యారేజ్, కాలువలు, విద్యుత్ అనుసంధానం, పంపింగ్ వ్యవస్థల నిర్మాణాన్ని వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత రెండున్నర సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండించి రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్లకు పైగా నేరుగా జమ చేశామని, ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో నిలిచిందన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పై ఉన్న న్యాయపరమైన చిక్కులను పరిష్కరించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు.

ప్రజలు దొరల పాలనకు మద్దతు పలకలేదు.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు దొరల పాలనకు మద్దతు పలకలేదన్నారు. ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారని, అదే ఇందుకు నిదర్శనమన్నారు. దానిని మనసులో పెట్టుకుని కక్షపెట్టి బీఆర్ఎస్ ఈ గిరిజన ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేసిందనడానికి సీతారామ ప్రాజెక్టే స్పష్టమైన ఉదాహరణ అన్నారు. మీ దీవెనలతో ఏర్పడిన ఈ ప్రభుత్వం, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ తమ బేషజాలకు పోయి, వారి ముద్ర ఉండకూడదనే దురుద్దేశంతో వ్యవహరించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎలాంటి బేషజాలకు, పట్టుదలకు పోకుండా వారి తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. వారు నిర్మించిన ప్రాజెక్టులను పక్కన పెట్టాలని, వదిలేయాలని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్‌కు ఇక్కడ ఏం చేసినా ఓట్లు రావని తెలిసి ఓటు రాజకీయాలు చేసి ప్రజల కష్టాలను విస్మరించిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి పాలకులు దెబ్బతీశారని, అయినప్పటికీ అందుబాటులో ఉన్న నిధులతోనే సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నామన్నారు. ఎంత కరువు వచ్చినా పంట పండించాలనే లక్ష్యంతో రైతు పంటలకు నీళ్లు ఇవ్వాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రను సక్రమంగా పోషించకుండా, ప్రభుత్వానికి సంబంధంలేని అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు.

Next Story