- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DGP: మహిళల రక్షణే లక్ష్యం.. సేఫ్ సిటీపై డీజీపీ సీవీ ఆనంద్ ఫోకస్
వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర ప్రజలకు అత్యున్నత భద్రత కల్పించడమే లక్ష్యంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, పాదచారులకు పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో చేపట్టిన సేఫ్ సిటీ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగర ప్రజలకు అత్యున్నత భద్రత కల్పించడమే లక్ష్యంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, పాదచారులకు పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో చేపట్టిన సేఫ్ సిటీ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో పోలీస్, మున్సిపల్, రవాణా, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యాధునిక సాంకేతికతతో నేరాల నివారణ, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కొత్తగా 862 అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు
నగర భద్రతలో కీలకమైన సీసీటీవీ నిఘా వ్యవస్థను సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్రాజెక్టు మొదటి దశలో మొత్తం 2,306 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 974, సైబరాబాద్‌లో 574, రాచకొండ పరిధిలో 758 కెమెరాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండో దశ కింద మరో 862 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని హైదరాబాద్ 452, సైబరాబాద్ 297, రాచకొండ 113 డీజీపీకి తెలిపారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ సీసీటీవీ కెమెరాలన్నీ ఎల్లప్పుడూ పనిచేసేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని డీజీపీ ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ ద్వారా సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను బలోపేతం చేయాలన్నారు.
మహిళల భద్రత, వారికి కల్పించే సదుపాయాలపై
మహిళల సౌకర్యార్థం నగరంలో ఇప్పటికే 12 మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయగా, వీటికి అదనంగా పరిశుభ్రమైన మరో 12 షీ టాయిలెట్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా సెంటర్లు, హాక్ ఐ యాప్ తదితర వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, వీటి సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, పాదచారుల భద్రత
నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 404 ట్రాఫిక్ సిగ్నల్స్‌ను తక్షణమే మరమ్మతులు చేసి, వంద శాతం పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. పాదచారుల భద్రత కోసం ఉన్న 77 ప్రాంతాల్లోని సిగ్నల్స్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే క్యూర్ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలని, పాదచారులు సురక్షితంగా రోడ్లు దాటే అవకాశాలు కల్పించాలన్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు, సైబర్ నేరాలు, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆడియో ప్రచార వాహనాలను సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీజీ మహేశ్ భగవత్, డీజీ చారు సిన్హా, ఐజీ గజరావు భూపాల్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేశ్ రెడ్డి, సుమతి, తరుణ్ జోషి, మున్సిపల్ కమిషనర్లు ఆర్.వి. కర్ణన్, సృజన , కృష్ణారెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ శృతి ఓజా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






