Jagannath Rath Yatra: ఘనంగా జరిగిన పూరి జగన్నాథ రథయాత్ర

by S Gopi |   (  Updated:2026-07-16 16:12:54  IST  )

ఈ జనసందోహంలో తీవ్రమైన తోపులాట జరిగి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి దాదాపు 200 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు.

Jagannath Rath Yatra: ఘనంగా జరిగిన పూరి జగన్నాథ రథయాత్ర
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరి క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జై జగన్నాథ్ నామస్మరణలు, శంఖ నాదాలు, మంగళ వాయిద్యాల మధ్య బలభద్రుని 'తాలధ్వజ', సుభద్ర దేవి 'దర్పదలన్', జగన్నాథుని 'నందిఘోష్' రథాలు గుండిచా ఆలయం వైపు సాగాయి. అయితే, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మునుపెన్నడూ లేని విధంగా లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా 'బడా దండ' (గ్రాండ్ రోడ్) వీధికి తరలిరావడంతో ఊహించని రద్దీ ఏర్పడింది. ఈ జనసందోహంలో తీవ్రమైన తోపులాట జరిగి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి దాదాపు 200 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేక రెస్క్యూ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగి బాధితులను పూరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఊరేగింపును సురక్షితంగా నిర్వహించడానికి ప్రభుత్వం 13 వేల మంది పోలీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కెమెరాలతో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ జనప్రవాహం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

గుజరాత్‌లోనూ పోటెత్తిన జనసందోహం

అయితే, పూరిలోనే కాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్ నగరాలలో కూడా జగన్నాథ రథయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రతిష్టాత్మక రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకోగా, రాజ్‌కోట్ వీధులు సైతం జగన్నాథుని రథాన్ని లాగేందుకు తరలివచ్చిన జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. పూరిలో కురిసిన 233 మి.మీ భారీ వర్షం వల్ల నిలిచిన నీటిని తొలగిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. గజపతి మహారాజ్ 'ఛేరా పహన్రా' (రథాలను బంగారు చీపురుతో ఊడ్చడం) సాంప్రదాయ కార్యక్రమం ముగిసిన తర్వాతే ఈ ఉత్సవాలు ఊపందుకున్నాయి.

Next Story