- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Security Deposit: అద్దె ఇళ్లలో రూ.1.26 లక్షల కోట్లు 'లాక్'
బెంగళూరులో 75 శాతం మంది అద్దెదారులు, అధిక సెక్యూరిటీ డిపాజిట్ కారణంగా తమకు నచ్చిన ఇంటికి మారలేకపోయామని చెప్పారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో అద్దెకు ఉండే కుటుంబాలకు చెందిన డబ్బు భారీగా సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో లాక్ అయ్యిందని ప్రముఖ ప్రాప్‌టెక్ సంస్థ నోబ్రోకర్ అధ్యయనం వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, చెన్నై, పూణే నగరాల్లో ఇంటి యజమానుల వద్ద సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు ఉన్నాయి. ఇందులో ఒక్క ముంబైలోనే రూ.41,156 కోట్లు, బెంగళూరులో రూ.31,628 కోట్లు డిపాజిట్లుగా ఉన్నాయి. ఢిల్లీ (24,054 కోట్లు), చెన్నై (రూ.17,346 కోట్లు), హైదరాబాద్ (రూ.6,843 కోట్లు), పూణె (రూ.5,015 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా బెంగళూరులో 75 శాతం మంది అద్దెదారులు, అధిక సెక్యూరిటీ డిపాజిట్ కారణంగా తమకు నచ్చిన ఇంటికి మారలేకపోయామని చెప్పారు. అయితే డిపాజిట్ రీఫండ్ విషయంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిస్థితి మెరుగ్గా ఉంది. అక్కడ 58 శాతం మంది అద్దెదారులు లీజు ముగిసిన తర్వాత పూర్తి డిపాజిట్‌ను తిరిగి పొందగా, కేవలం 12 శాతం మంది మాత్రమే ఈ విషయంలో వివాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అద్దె భారంతో సతమతం
ఈ నివేదిక మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. మెట్రో నగరాల్లో నివసించే సగటు ఉద్యోగి బడ్జెట్‌లో సగం వాటా అద్దెకే హారతవుతోంది. ముఖ్యంగా ముంబైలో ప్రతి 10 మందిలో నలుగురు తమ నెలవారీ సంపాదనలో 40 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని అద్దె కోసమే వెచ్చిస్తున్నారు. ఒకప్పుడు అద్దె కట్టే బదులు సమానమైన ఈఎంఐ (ఈఎంఐ) కట్టి సొంతిల్లు కొనుక్కోవచ్చు అనే ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. 2021తో పోలిస్తే అద్దెకు, హోమ్ లోన్ ఈఎంఐకి మధ్య ఉన్న వ్యత్యాసం భారీగా పెరిగింది. ఉదాహరణకు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈఎంఐ భారం అద్దె కంటే దాదాపు 2.4 రెట్లు ఎక్కువగా ఉంది. ఫలితంగా, సొంత ఇల్లు కొనడం ఆర్థికంగా భరించలేని భారంగా మారడంతో, ఇష్టం లేకపోయినా కేవలం బడ్జెట్ లెక్కల కోసమే చాలా మంది మధ్యతరగతి ప్రజలు జీవితాంతం అద్దె ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది.
తొందరగా ఇల్లు మారుతున్న జెన్-జీ
అద్దె మార్కెట్‌లో మరో ఆసక్తికర మార్పు కూడా కనిపిస్తోందని నివేదిక అభిప్రాయపడింది. జెన్-జీ (18–24 ఏళ్లు) అద్దెదారులు పాత తరాలతో పోలిస్తే దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా ఇళ్లు మారుతున్నారు. ఈ వయసు వారిలో 30 శాతం మంది ప్రతి ఆరు నుంచి 12 నెలలకోసారి కొత్త ఇంటికి మారుతుండగా, 35 ఏళ్లు దాటిన వారిలో ఇది కేవలం 10 శాతం మాత్రమే ఉంది. వయసు పెరిగే కొద్దీ స్థిరత్వం కూడా పెరుగుతోంది. ఇక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ల కోణంలో చూస్తే.. పెద్ద ఇళ్ల (త్రిబుల్ బెడ్‌రూమ్, 4బెడ్‌రూమ్) కంటే చిన్న ఫార్మాట్లయిన 1 బెడ్‌రూమ్లు, స్టూడియో అపార్ట్‌మెంట్ల ద్వారానే ఎక్కువ అద్దె రాబడి వస్తోంది. ఈ విభాగంలో బెంగళూరు 4.8 శాతం, హైదరాబాద్ 4.6 శాతం గరిష్ట రాబడితో అగ్రస్థానంలో నిలిచాయి. ఇళ్ల సైజు పెరిగేకొద్దీ అద్దె ద్వారా వచ్చే లాభం 3 శాతం కంటే తక్కువకు పడిపోతోందని నివేదిక స్పష్టం చేసింది.






