డెలివరీ అయ్యే దాకా సెక్స్‌లో పాల్గొనద్దా?

by Sujitha Rachapalli |

మేడమ్! నాకు వివాహమై రెండు సంవత్సరాలవుతోంది. నా భార్యకు మొదటిసారి అబార్షన్ అయ్యింది. ఇప్పుడు తాను గర్భవతి. ఐదో నెల గడుస్తున్నది.

డెలివరీ అయ్యే దాకా సెక్స్‌లో పాల్గొనద్దా?
X

ప్రశ్న : మేడమ్! నాకు వివాహమై రెండు సంవత్సరాలవుతోంది. నా భార్యకు మొదటిసారి అబార్షన్ అయ్యింది. ఇప్పుడు తాను గర్భవతి. ఐదో నెల గడుస్తున్నది. తన గర్భసంచి వదులుగా ఉందని డాక్టర్ కుట్లు వేసింది. డెలివరీ అయ్యే దాకా సెక్స్‌లో పాల్గొనొద్దని చెప్పింది. నాకు చాలా కష్టంగా ఉంది. కోరికలు ఆపుకోలేక పోతున్నా. కలిస్తే అబార్షన్ అవుతుందట. బయటకు వెళ్లలేను. ఏం చేయాలో తోచడం లేదు. పైపైన చెయ్యొచ్చా. నా భార్య ఒప్పుకోవడం లేదు. బయట స్త్రీలతో సెక్స్‌లో పాల్గొనాలని ఉంది. కానీ.. పాల్గొంటే ప్రమాదమని తెలుసు. సలహా ఇవ్వండి.

జవాబు : నీ భార్యకు గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ వదులుగా ఉండటం వల్ల కుట్లు వేసే ‘సర్కిలాజ్’ అనే ఆపరేషన్ చేశారు. ఆమెకు పూర్తిగా శారీరకంగా, మానసికంగా విశ్రాంతి అవసరం. సెక్స్‌లో పాల్గొంటే ఆబార్షన్ అవుతుంది. నీ భార్యకు కూడా ప్రమాదం. పైపైన సెక్స్ వల్ల కూడా గర్భసంచి కండరాలు సంకోచానికి గురై బిడ్డకు, తల్లికి ప్రమాదం. అసలే ముందు అబార్షన్ అయ్యి.. ఇప్పుడు వచ్చిన గర్భం నిలుస్తుందో లేదో అన్న భయం, అభద్రతలో ఉన్న నీ భార్యను సెక్స్ కోసం ఎందుకు వేధిస్తావు? నీ నుంచి ఆమె తన గర్భాన్ని కాపాడుకునే ప్రయత్నంలో నిరంతరం అభద్రతకు, భయానికి గురి అవ్వాలా? ఆమెకు రక్షణ, మంచి ఆహారం, వైద్యం, మానసిక శాంతి ఇచ్చే బదులు నువ్వే సతాయిస్తే ఎలా? ‘అసలు బయటకు వెళ్లలేను. బయట స్త్రీలతో సెక్స్‌లో పాల్గొంటే ప్రమాదమని తెలుసు’ లాంటి నీచమైన మాటలు ఎలా వస్తున్నాయి. ఇంట్లో భార్య తాత్కాలికంగా శృంగారానికి పనికి రాని మనోశారీరక స్థితిలో ఉంటే ఆమెను మరింత బాగా శ్రద్దగా, ప్రేమగా చూస్కోవాల్సిన సహజీవనపు కనీస సూత్రాన్ని మరిచి.. ‘బయటి స్త్రీలతో వెళ్లొచ్చో లేదో’ అన్న సందేహంలో ఉన్నావు. భర్తకి ఏదైనా రోగం, యాక్సిడెంట్ లేదా అంగస్తంభన సమస్య, శీఘ్రస్కలన సమస్య వస్తే.. ‘అయ్యో నా భర్త ఇలా పనికి రాకుండా అయిపోయాడు.. నేనింకో మగాడి దగ్గరికి పోలేను కదా’ అని ఆలోచించదు.

20 ఏళ్ల నా సెక్సాలజీ ప్రాక్టీసులో ఏ స్త్రీ అడగలేదు ఇలా. ‘నా భర్త ఆర్యోగం సరి చేస్కోవడానికి నేనేం చేయాలి? ఎలాంటి మందులు వాడాలి? ఆయనకి నేనెలా సహకరించాలో చెప్పండి డాక్టర్. ఆయన కోసం నేనేమన్నా చేస్తాను’ అని అడిగిన వారే ఉన్నారు. పూజలు, ఉపవాసాలూ చేస్తారు. మీ భర్తలకు ఇలా మానసిక స్థైర్యాన్ని, భద్రతను, తోడును ఇవ్వటమే తప్ప కల్మషం లేని భార్యలు ఉన్నారు. మీరు మాత్రం భార్య అనారోగ్యంగా ఉంటే మానసికంగా ఆమెను సాధిస్తూ బయట స్త్రీల దగ్గర మీ తుచ్చమైన లైంగిక వాంఛలు తీర్చుకునే ప్రణాళికలు వేస్తుంటారు. వెళ్లిచూడు.. సుఖరోగాలు, ఎయిడ్స్ రోగస్థులై..నీ భార్యకు కూడా ఎయిడ్స్ అంటిస్తావు. నువ్వు మరణించే వరకూ చస్తూ బతుకుతవు. మీ మరణం తర్వాత అనాథలైన నీ పిల్లలు అమ్మా నాన్నా లేని, దయలేని లోకంలో ఉంటారు. ఇదీ నువ్వు నీ కుటుంబానికిచ్చే కానుక. నువ్వు పైపైన సెక్స్ చేయొద్దు. నీ భార్యని వేధించవద్దు. బయట స్త్రీల దగ్గర్కి వెళ్లొద్దు. కాన్పు అయ్యే దాకా నిబ్బరంగా ఉండు. మంచి ఆహారం, ప్రేమ, భద్రత ఇస్తూ నీ భార్య ప్రసవం ఆరోగ్యకరంగా అయ్యేటట్లు చూడు. నువ్వేనా, నీ భార్య కూడా గర్భావస్థ సమయంలో సెక్స్‌కు దూరంగా ఉండటం లేదా? స్త్రీకి గర్భం రావడానికి కారణం భర్త కూడా? గర్భం, ప్రసవం, ప్రసవానంతర మాతా శిశు సంరక్షణలో భర్త కూడా అంతే బాధ్యతగా, నిజాయితీగా ఉండాలి.

Next Story