బచ్చన్నపేట భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

by Ratna Kumari |

బచ్చన్నపేటలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

బచ్చన్నపేట భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
X

దిశ, జనగామ : బచ్చన్నపేటలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జనగామ ఇన్‌చార్జి ఏసీపీ బీమ్ శర్మ గురువారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన బాధిత కుటుంబం హైదరాబాద్‌కు వెళ్లగా, 10వ తేదీన ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ జరిగినట్లు గుర్తించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితులను గుర్తించారు. అనంతరం బచ్చన్నపేట మండలం కొన్నె క్రాస్‌రోడ్డు వద్ద ప్రధాన నిందితుడు కంప విజయ్ అలియాస్ "మొండి"తో పాటు ఇద్దరు జువైనల్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారి వద్ద నుంచి రూ.15.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ.15 వేల నగదు, మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ బీమ్ శర్మ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story