సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో..

by Ratna Kumari |

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ యువకుడిని పర్వతగిరి పోలీసులు అరెస్టు చేశారు.

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో..
X

దిశ, పర్వతగిరి : సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ యువకుడిని పర్వతగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 8 కిలోల 795 గ్రాముల ఎండు గంజాయి, ఒక యాక్టివా స్కూటర్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలం అన్నారం గ్రామానికి చెందిన **సయ్యద్ ఖాజా (25)** డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. 2023లో వినాయక విగ్రహాల వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి స్మగ్లింగ్ వైపు మళ్లినట్లు పోలీసులు తెలిపారు.

గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఒడిశాకు చెందిన ఓ గంజాయి వ్యాపారితో పరిచయం ఏర్పడడంతో, అక్కడి నుంచి గంజాయి కొనుగోలు చేసి వరంగల్‌లో విక్రయించడం ప్రారంభించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. చింతూరులో కిలో రూ.7 వేల చొప్పున కొనుగోలు చేసి, వరంగల్‌లో కిలో రూ.15 వేల చొప్పున విక్రయించేవాడని పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం ఒడిశా వ్యాపారితో సంప్రదించి యాక్టివాపై చింతూరుకు వెళ్లిన ఖాజా.. అక్కడ సుమారు 8.795 కిలోల ఎండు గంజాయిని కొనుగోలు చేసి, బ్యాగు, సూట్‌కేసులో దాచుకుని తిరిగి వస్తుండగా పట్టుబడ్డాడు.

గురువారం సాయంత్రం పర్వతగిరి ఎస్‌ఐ ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసులు మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న యాక్టివాను ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్యాగు, సూట్‌కేసులో గంజాయి ఉన్నట్లు గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 8.795 కిలోల గంజాయి, యాక్టివా స్కూటర్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story