రాష్ట్రంలో నూతన EHS గైడ్‌లైన్స్ విడుదల.. జీవో నెం.50ని జారీ చేసిన ప్రభుత్వం

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఈహెచ్ఎస్ (EHS) పథకం అమలుకు జీవో నెం. 50 విడుదలైంది.

రాష్ట్రంలో నూతన EHS గైడ్‌లైన్స్ విడుదల.. జీవో నెం.50ని జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత (Cashless) వైద్య సేవలు అందించే ఉద్యోగుల ఆరోగ్య పథకం (Employees Health Scheme) అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా సీఎస్ సంజయ్ జాజు జీవో నెం.50ని విడుదల చేశారు.

ఈహెచ్‌సీ ట్రస్ట్ (EHCT) పునర్వ్యవస్థీకరణ..

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ బోర్డ్ ట్రస్టీలను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ కొత్త బోర్డులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులకు స్థానం కల్పించారు. ఈ నూతన ఈహెచ్ఎస్ నిధి కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే, పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుంచి 1.5 శాతం వాటాను కాంట్రిబ్యూషన్‌గా అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

పరిపాలనా అధికారాలు ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు..

ఇకపై ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతమైన అమలు చేసేందుకు గాను, నిర్వహణ బాధ్యతలను, పూర్తి అధికారాలను ఈహెచ్‌సీ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకోనుంది. ఈహెచ్ఎస్ నిధులను కేవలం సభ్యులైన ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన అర్హులైన కుటుంబ సభ్యుల వైద్య ప్రయోజనాల కోసమే వినియోగించేలా బోర్డు చర్యలు తీసుకుంటుంది. ట్రస్ట్ రూల్స్, నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకతతో, జవాబుదారీతనంతో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)ను ప్రభుత్వం ఆదేశించింది.




Next Story