- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూకేకు ఎగుమతులు పెంచుతాం : మంత్రి శ్రీధర్‌బాబు
యూకేకు రాష్ట్రం నుంచి ఎగుమతులు పెంచుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: యూకేకు రాష్ట్రం నుంచి ఎగుమతులు పెంచుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గురువారం యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ (దక్షిణాసియా) చంద్రు కె అయర్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత్- యూకే మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) వల్ల తెలంగాణ గరిష్ఠ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం వల్ల దేశం నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యూకే సుంకాలను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య రూ.3.25 లక్షల కోట్ల వాణిజ్యానికి అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో పారిశ్రామిక వస్తూత్పత్తి, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటి, సెమికండక్టర్స్, చిప్ ల డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను వృద్ధి చేసామని, యూకే పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రం నుంచి యూకేకు ప్రస్తుతం రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు మాత్రమే జరుగుతున్నాయని వెల్లడించారు.
దేశంలోని ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం ఇక్కడే జరుగుతున్నాయని, వ్యాక్సిన్ ఎగుమతుల్లో 30 శాతం రాష్ట్రానిదేనని తెలిపారు. విమానయాన రంగానికి అవసరమైన ప్రిసిషన్ విడిభాగాల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని గుర్తు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత ఏవియేషన్ సంస్థలు ఎయిర్ బస్, బోయింగ్, రోల్స్ రాయిస్, విమాన ఇంజన్ల తయారీ సంస్థ ప్రాట్ అండ్ విట్నీస్, డసో ఏవియేషన్ ఉత్పత్తి చేసే రఫేల్ విమానాల విడిభాగాల తయారీ, ఓవర్ హాలింగ్ సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. టాటా అడ్వాన్సుడ్ సిస్టమ్స్, సఫ్రాన్ ఏవియేషన్ సంస్థలు పరిశ్రమలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసారు. హైదరాబాద్‌లో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా పలు ప్రఖ్యాత సంస్థలు 450 జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేశాయని చెప్పారు. యూకే ప్రతినిధి బృందంలో సిద్ధార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమల శాఖ స్సెషల్ సెక్రెటరీ కృష్ణాదిత్య తదితరులు పాల్గొన్నారు.






