భట్టి సమైక్య వాది.. ఎప్పుడూ తెలంగాణపై మాట్లాడలేదు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

by Vemula.Srinu Prasad |

రేవంత్‌రెడ్డి పాలమూరుకు చేసింది శూన్యమని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సీఎం తెలంగాణ తడి లేని పొడి మనిషి అని విమర్శించారు...

భట్టి సమైక్య వాది.. ఎప్పుడూ తెలంగాణపై మాట్లాడలేదు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి పాలమూరుకు చేసింది శూన్యమని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సీఎం తెలంగాణ తడి లేని పొడి మనిషి అని విమర్శించారు. భట్టి సమైక్య వాది అని.. ఎప్పుడూ తెలంగాణ గురించి మాట్లాడలేదని అన్నారు. ఇంకా సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. జలయజ్ఞంలో సైతం పాలమూరు ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయని.. భీమా, కోయిల్‌సాగర్ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు రెండు తరాల జీవితాలను కోల్పోయిందని.. మళ్లీ వలసలు పోవడమే రేవంత్‌రెడ్డి పాలమూరుకు ఇచ్చే బహుమానం అని ఎద్దేవా చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన నీళ్లు పాలమూరుకు రాలేదని.. 10 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు ఇచ్చారని వెల్లడించారు. శ్రీశైలం దగ్గర సోర్స్ పెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని.. 27 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని తెలిపారు. రెండున్నరేళ్లు పాలమూరు-రంగారెడ్డిపై సీఎం సమీక్ష చేయలేదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నదని.. అయినా చేయడం లేదని అన్నారు. రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ ప్రసంగాలు ఉండాలని.. ఇకనైనా తన భాష మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కిషోర్‌గౌడ్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, గౌతమ్ ప్రసాద్ పాల్గొన్నారు.

Next Story