18న భారీ సదస్సు.. యువతకు కేటీఆర్ కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని.. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ..

18న భారీ సదస్సు.. యువతకు కేటీఆర్ కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని.. సగం పదవీకాలం పూర్తికాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం పార్టీ నేతలతోపాటు హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిన మోసకారి ప్రభుత్వంగా కాంగ్రెస్ మారిందన్నారు. అందుకే సమాజంలోని ప్రతి వర్గం ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని విమర్శించారు. ఆడబిడ్డల నుంచి అన్నదాతల వరకు.. విద్యార్థుల నుంచి నిరుద్యోగ యువత వరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, అవినీతి, స్కామ్‌లు, అక్రమాలు, అరాచకాలనే పాలనగా మార్చుకున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న మాటలు, అనుసరిస్తున్న విధానాలు, సాగిస్తున్న పాలన ప్రజా కంటకంగా మారాయని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి చేయించుకున్న సర్వేలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని పేర్కొన్నారు. చివరకు రైతులు సైతం తమ రక్తాన్ని తీసుకోండి... కానీ తమ పొలాలకు నీళ్లు ఇవ్వండని డిమాండ్ చేసే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. యువత, నిరుద్యోగుల విషయంలోనూ యూత్ డిక్లరేషన్ పేరిట భారీ మోసం చేసిందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎప్పటికప్పుడు ఆ మోసాన్ని ఎండగడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లలోని హామీల అమలు వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ వరుసగా సభలు నిర్వహిస్తోందని తెలిపారు.

వరంగల్ రైతు సభ అనంతరం ఈ నెల 18న సరూర్‌నగర్ స్టేడియంలో యువత, విద్యార్థులతో భారీ యువజన సదస్సు నిర్వహించి కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. యువజన సభకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉన్నదని.. అలాంటి ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story