- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల కోసం భూ పోరాటాలను తీవ్రతరం చేస్తాం
పేదలకు ఇళ్ల స్థలాలు అందించే వరకు భూ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : పేదలకు ఇళ్ల స్థలాలు అందించే వరకు భూ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ తదితర వామపక్ష పార్టీలు భారీ పికెటింగ్ నిర్వహించాయి. ఉదయం నుంచే కలెక్టరేట్ వద్దకు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు అధికారుల రాకను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పికెటింగ్ కారణంగా ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందే వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గబోమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ మాఫియా, భూకబ్జాదారుల నుంచి రక్షించి, వాటిని నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు వామపక్షాలు భూ పోరాటాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. పేదల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, నిరుపేదలపై జరుగుతున్న చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పికెటింగ్ కొనసాగుతుండగా సుబేదారి పోలీసులు జోక్యం చేసుకుని తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో పాటు వామపక్ష నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకుల అరెస్టును అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు, వామపక్ష కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుని కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సీపీఎం జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్ రెడ్డి, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. హంసారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, పలువురు వామపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






