ఉత్తమ విద్యాసంస్థలుగా ప్రభుత్వ పాఠశాలలు

by Taduka Kalyani |

ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ విద్యాసంస్థలని యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. ప్రమీల అన్నారు.

ఉత్తమ విద్యాసంస్థలుగా ప్రభుత్వ పాఠశాలలు
X

దిశ,సంస్థాన్ నారాయణపురం: ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ విద్యాసంస్థలని యాదాద్రి భువనగిరి జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె. ప్రమీల అన్నారు. పట్టుదలతో చదివి లక్ష్యంపై గురి పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక, జనగాం గ్రామాల్లోని జడ్పీ ఉన్నత, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం హైదరాబాదుకు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 మంది విద్యార్థులకు సమకూర్చిన "స్టూడెంట్స్ కిట్" లను జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతితో కలిసి విద్యార్థులకు ఆమె పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీల మాట్లాడుతూ..తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివానని తాను ఈ స్థానంలో ఉండడానికి అప్పట్లో తనకు పాఠాలు బోధించిన ప్రభుత్వ ఉపాధ్యాయుల గొప్పతనం అని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత విద్యార్హతలు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారని తెలిపారు. విద్యార్థులు లక్ష్యంపై గురి పెట్టి పట్టుదలతో విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ నవోదయ విద్యాలయంలో చదివిన తుపాకుల రవి, అతని మిత్రులు కలిసి రిలయబుల్ ట్రస్టును స్థాపించి వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సహాయం అందిస్తున్నందుకు ఆయనను అభినందించారు. దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం డీఈవో బిక్షపతి మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాల వృక్షం లాంటిదని ఎంతోమందికి ఆవాసం కల్పిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి తెలిపారు. ప్రైవేటుపై మోజుతో పిల్లలను అటువైపు పంపితే ప్రభుత్వ పాఠశాలలు మూతబడతాయని నిరుద్యోగులకు ఉపాధి లభించదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని అన్ని జడ్పీ ఉన్నత పాఠశాలల కు చెందిన 1139 మంది విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్, పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ ఉచితంగా అందజేసిన రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ తుపాకుల రవిని అభినందించి సన్మానించారు. రిలయబుల్ ట్రస్టీ తుపాకుల రవి మాట్లాడుతూ..ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ నవోదయ విద్యాలయంలో చదువుకున్న తాను తన మిత్రులను కలిసి రిలయబుల్ ట్రస్టును స్థాపించామని, ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అనాధ బాలలకు సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హనుమంతు, కే. ఉదయ అధ్యక్షత వహించారు. ఎంఈఓ జి. శ్రీనివాస్, సర్పంచులు గజం అనిత, లోడే రఘు, జడ్పీ ఉన్నత పాఠశాలల రమాదేవి, రఘుమారెడ్డి, అశోక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్య ప్రాముఖ్యతను తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్థులు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

Next Story