అవినీతిపై ఉక్కుపాదం.. మహిళ ఎంపీ ఇంట్లో గోల్డెన్ బ్రా!.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

by Prasad Jukanti |   (  Updated:2026-07-01 13:09:17  IST  )

ఇరాక్‌లో 'ఆపరేషన్ డాన్ క్రాక్‌డౌన్' పేరిట జరిగిన అవినీతి నిరోధక దాడుల్లో యావత్ ప్రపంచం నివ్వెరపోయే దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి.

అవినీతిపై ఉక్కుపాదం.. మహిళ ఎంపీ ఇంట్లో గోల్డెన్ బ్రా!.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరాక్‌లో అవినీతికి వ్యతిరేకంగా అక్కడి కొత్త ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ డాన్ క్రాక్‌డౌన్’ (Operation Dawn Crackdown) ఆ దేశ రాజకీయ వర్గాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త ప్రధానమంత్రి అలీ అల్-జైదీ నేతృత్వంలోని ఇరాక్ భద్రతా దళాలు ఆ దేశ రాజధాని బాగ్ధాద్‍లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్రీన్ జోన్‍తో పాటు పలు నగరాల్లో ఇటీవల ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. సిట్టింగ్ ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లపై అకస్మాత్తుగా జరిగిన దాడుల్లో వారి గుట్టు రట్టయింది. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఎత్తున నగదు, బంగారం, విలాసవంతమైన వస్తువులు, చివరకు రహస్య గుర్రాల శాలలు బయటపడటం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఈ తనిఖీల్లో 67 మందికి పైగా అవినీతి అధికారులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి.

మహిళా ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు!:

ఈ దాడుల్లో కళ్లు చెదిరే రీతిలో నోట్ల కట్టలతో పాటు స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లు బయట పడ్డాయి. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ క్రమంలో ఓ పోస్టు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఈ తనిఖీల్లో భాగంగా మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో అధికారులు జరిపిన సోదాల్లో రూ.475 కోట్ల నగదు, బంగారంతో పాటు అత్యంత విలాసవంతమైన వస్తువులు, బంగారంతో తయారు చేసిన అండర్ వేర్ సెట్ లభించిందంటూ పలు పోస్టులు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

నెటిజన్ల ఫైర్:

హింద్ అల్-అబ్బాసి ఇంట్లో వెలుగు చూసిందని చెప్పబడుతున్న గోల్డెన్ బ్రా ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఆమె అవినీతిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే పలు అంతర్జాతీయ, ఇరాక్ స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇరాక్‌లో ఒక ఎంపీ ఇంట్లో భారీగా నగదు, బంగారం సీజ్ అయిన మాట వాస్తవమే అయినా, వైరల్ అవుతున్నట్టుగా ఎంపీ హింద్ అల్-అబ్బాసి ఇంట్లో కాదని మరో జాతీయ మీడియా పేర్కొంది. అలాగే ఈ దాడుల్లో 'బంగారు లోదుస్తులు' దొరికాయనే ప్రచారానికి ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని నెటిజన్లను ఆకర్షించేందుకు, క్లిక్స్ కోసం కొందరు అనామక వ్యక్తులు ఒక పాత ఫోటోను దీనికి ముడిపెట్టి ఫేక్ ప్రచారం సృష్టించినట్లు ఈ కథనం పేర్కొంది.

సాధారణ పోలీసులకు బదుల సీటీఎస్ రంగంలోకి:

‘ఆపరేషన్ డాన్ క్రాక్‌డౌన్’ (Operation Dawn Crackdown) పేరుతో ఈ ఆపరేషన్ చేపట్టిన ఇరాక్ కొత్త ప్రభుత్వం ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సాధారణ పోలీసుల వల్ల కాదని కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ రంగంలోకి దింపింది. అరెస్ట్ కాబోతున్న వారు అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నేతలు కావడంతో వారు సాధారణ పోలీసులపై దాడులకు దిగే అవకాశం లేదా లంచాలు ఇచ్చి తప్పించుకునే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం దేశంలోని అత్యున్నత రక్షణ విభాగమైన కౌంటర్ టెర్రరిజం ఫోర్స్ (CTS) ను రంగంలోకి దించింది. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఇరాక్ లాంటి దేశంలో నేతలు మిలియన్ల కొద్దీ డాలర్లు, బంగారాన్ని ఇళ్లలో కుప్పలుగా దాచుకోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Next Story