- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంచర్ల పాఠశాలలో జాతీయ జెండా కట్ట ధ్వంసం
మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలోని కేంద్ర ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు జాతీయ జెండా కట్టను ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది.

దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలోని కేంద్ర ప్రాథమిక పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు జాతీయ జెండా కట్టను ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు జెండా కట్ట ధ్వంసమైనట్లు గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేణుకాదేవి, ఉపాధ్యాయుడు భీంరెడ్డి ధృవీకరించారు. ఇదే పాఠశాలలో గతంలో కూడా పలుమార్లు గుర్తుతెలియని వ్యక్తులు ఫ్యాన్లు, కిటికీలు, చెక్క సామగ్రిని ధ్వంసం చేసిన ఘటనలు జరిగాయని తెలిపారు. అదేవిధంగా రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు పాఠశాల ఆవరణలో మద్యం సేవించి, మద్యం సీసాలు పగులగొట్టడంతో పాటు బిర్యానీ, ఇతర మాంసాహార పదార్థాలు తిని చెత్తను అక్కడే వదిలివెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన నిఘా లేకపోవడంతో ఇటువంటి దుశ్చర్యలు పునరావృతమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ విద్యాసంస్థలో జాతీయ జెండా కట్టను ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమని, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే పాఠశాల ఆవరణను అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది డిమాండ్ చేశారు. అలాగే రాత్రి వేళల్లో పాఠశాల వద్ద ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు.






