- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అడవిలోకి వస్తే కేసులు పెడతాం’.. న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన విలేకరులపై అటవీ శాఖ అధికారుల చిందులు
పోడు భూముల వివాదంపై కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై అటవీ శాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బెదిరింపులకు దిగడం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, పినపాక: పోడు భూముల వివాదంపై కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై అటవీ శాఖ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బెదిరింపులకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. పినపాక మండలం బోటిగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలోని బందగిరినగరంలో పోడు సాగుదారులకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న విలేకరులు కవరేజ్ కోసం ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరుగుతున్న ఘర్షణను విలేకరులు చిత్రీకరిస్తున్న సమయంలో ఏడుల్లబయ్యారం అటవీ రేంజ్ అధికారి(ఎఫ్ఆర్వో) స్నేహలత విలేకరులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "అడవిలోకి మీకు ప్రవేశం లేదు, ఎవరి అనుమతితో వచ్చారు? మేమే ఫోటోలు ఇస్తాం, మీరు వార్తలు రాసుకోండి. అటవీ చట్టాల ప్రకారం అడవిలోకి వస్తే కేసులు పెడతాం!" అని హెచ్చరించారు.
విలేకరి స్వేచ్ఛను హరించడమే: ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంతోష్
విలేకరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, కేసులు పెడతామని బెదిరించిన ఎఫ్ఆర్వో స్నేహలత వ్యాఖ్యలను ‘సత్యమేవ జయతే’ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి జీతభత్యాలు లేకపోయినా ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వానికి-ప్రజలకు వారధిగా నిలిచే విలేకరులను కించపరచడం వ్యవస్థకే అవమానకరమని అన్నారు. కేసులు పెట్టాలనుకుంటే గతంలో అమాయక ఆదివాసీల నుండి లంచాలు తీసుకుని, మేకలు-కోళ్లు తింటూ సాగుకు సహకరించిన బీట్ ఆఫీసర్లపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్య ఎక్కడుంటే విలేకరి అక్కడ ఉంటాడు. అడవికే కాదు, కాశ్మీర్ బోర్డర్ వరకైనా వెళ్లే స్వేచ్ఛ, ధైర్యం విలేకరులకు ఉన్నాయని స్పష్టం చేశారు. తక్షణమే 'దిశ' విలేకరికి ఎఫ్ఆర్ఓ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో పినపాక నియోజకవర్గ విలేకరుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రెస్ క్లబ్ హెచ్చరించింది.






