రెబ్బెన వ్యాపారులకు న్యాయం చేస్తాం : ఎంపీ గోడం నగేష్

by Batti.Sumithra |

రెబ్బెన మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ హామీ ఇచ్చారు.

రెబ్బెన వ్యాపారులకు న్యాయం చేస్తాం : ఎంపీ గోడం నగేష్
X

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రంలో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం రెబ్బెన మండల కేంద్రంలోని దుకాణ సముదాయాలను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యాపారులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎంపీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తహసీల్దార్ ఫీల్డ్ విచారణ నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారని తెలిపారు.

దుకాణాలకు సంబంధించిన రికార్డులు, ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించి వ్యాపారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యాపారులు మాట్లాడుతూ తాము దాదాపు 60 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ స్థలం రైల్వే శాఖకు చెందినదని రైల్వే అధికారులు చెబుతుండగా, రాష్ట్ర ప్రభుత్వ భూమి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారని వివరించారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపించి తమకు న్యాయం చేయాలని ఎంపీని కోరారు. ఎంపీ పర్యటనతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యాపారులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story