గిరిజన బాలుడి మృతిపై ఐటీడీఏ పీఓకు ఆదివాసీ సంఘాల ఫిర్యాదు

by Taduka Kalyani |

కరెంట్ షాక్‌కు గురై అమాయక గిరిజన బాలుడు మృతి చెందిన ఘటనపై విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివాసీ సంఘాల నాయకులు గురువారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.

గిరిజన బాలుడి మృతిపై ఐటీడీఏ పీఓకు ఆదివాసీ సంఘాల ఫిర్యాదు
X

దిశ,పాల్వంచ(టౌన్)జూలై : కరెంట్ షాక్‌కు గురై అమాయక గిరిజన బాలుడు మృతి చెందిన ఘటనపై విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివాసీ సంఘాల నాయకులు గురువారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. గిరిజనుల ప్రాణాలకు విలువ లేకుండా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమర్పించిన వినతిపత్రంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర లోపాలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమే బాలుడి ప్రాణాన్ని బలితీసుకుందని పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల్లో తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా విద్యుత్ శాఖ తీరులో మార్పు రావడం లేదని, ఈ ఘటనను సాధారణ ప్రమాదంగా కాకుండా అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన మరణంగా పరిగణించి సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే తగిన ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఐటీడీఏ ప్రత్యేకంగా జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పూర్తిగా పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న లైన్లు, స్తంభాలను వెంటనే మరమ్మతులు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు ధార బోయిన రమేష్,జిల్లా కార్యదర్శి,చర్ప అశోక్, వాడే చంటి,జోగ సురేష్,వాడే వెంకటేష్,గొగ్గల సాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story