ఊపిరి పీల్చుకున్న ఆఘాపురా నాలా

by Naga Rani Yarlagadda |

వ్యర్థాల‌తో నిండిపోయి.. వ‌ర‌ద ప్ర‌వాహానికి ఏమాత్రం అవ‌కాశం లేకుండా ఉన్న ఆఘాపురా నాలా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది.

ఊపిరి పీల్చుకున్న ఆఘాపురా నాలా
X
  • 56 ట్ర‌క్కుల పూడిక‌ తీసిన హైడ్రా

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యర్థాల‌తో నిండిపోయి.. వ‌ర‌ద ప్ర‌వాహానికి ఏమాత్రం అవ‌కాశం లేకుండా ఉన్న ఆఘాపురా నాలా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది. మెషిన‌రీ దించ‌డానికి ఏమాత్రం అవ‌కాశం లేకుండా ఉన్న ఈ నాలా ఇప్పుడు పూడిక‌ను వ‌దిలించుకుంది. మెహిదీప‌ట్నం, విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ, ఏసీఘాట్స్‌, మ‌ల్లేప‌ల్లి, నాంప‌ల్లి ప్రాంతాల నుంచి వ‌ర‌ద నీటిని మూసీకి తీసుకెళ్లే నాలా ఇది. వ్య‌ర్థాల‌తో పూర్తిగా నిండిపోయింది. వ‌ర‌ద నీరు ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఇంట్లో ప‌నికిరాని వ‌స్తువంతా అక్క‌డ‌కు చేరిన‌ట్టయ్యింది. ప‌రుపులు, దిండులు, బెడ్‌షీట్లు, కుర్చీలు, సోఫాల‌కు వినియోగించే రెగ్జిన్‌తో నిండిపోయింది. దారూస‌లాం వ‌ద్ద క‌ల్వ‌ర్టు ద‌గ్గ‌ర పేరుకుపోయిన పూడిక ఫొటోలు, వీడియోలు నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. హైడ్రా అధికారుల‌కు కూడా చేరాయి. అంతే మ‌రుచ‌టి రోజునుంచే పూడిక తీయ‌డం మొద‌లు పెట్టింది హైడ్రా. మెషిన‌రీని ఆ కాలువ‌లోకి దించ‌డానికి వీలు లేని ప‌రిస్థితి. దీంతో హైడ్రా మెట్‌, డీఆర్ఎఫ్‌ బృందాలు దిగి పూడిక‌ను తొల‌గించాల్సిన ప‌రిస్థితి. అక్క‌డ ప‌ని చేసిన వారికి గ్లౌజులు, మోకాల వ‌ర‌కూ ఉండే గ‌మ్ బూట్లు ఇలా మాస్కులు పూడిక తీత‌కు అవ‌స‌ర‌మైన ప‌నిముట్లు కూడా హైడ్రా అంద‌జేసింది. ప‌నిలో ఆటంకంగా ఉన్నాయ‌నో.. వాటిని ధ‌రించి ప‌ని చేయ‌డానికి వీలు కాలేదో కానీ.. వాటిని ధ‌రించ‌కుండా కొంత‌మంది ప‌ని చేశారు. ఆ ఫొటోల‌ను కూడా మ‌ళ్లీ నెట్టింట్లో పెట్టి.. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ప‌ని చేస్తున్న సిబ్బంది అని కూడా వైర‌ల్ చేశారు. ఇలా ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. హైడ్రా ల‌క్ష్యం ఒక్క‌టే.. ఆ వ‌ర‌ద కాలువ‌లో పూడిక‌ను మొత్తం తొల‌గించాలి.. అదే ల‌క్ష్యంగా వారం రోజులు ప‌ని చేసి మొత్తం 56 ట్ర‌క్కుల పూడిక‌ను తొల‌గించింది. దీంతో ఆ వ‌ర‌ద కాలువ‌కు ఊపిరి పోసిన‌ట్ట‌య్యింది. పూడిక‌ను అక్క‌డే ప‌డేయ‌కుండా వెనువెంటనే త‌ర‌లించింది. హైడ్రా అధికారులు ఆర్ఎఫ్‌వో జ‌య‌ప్ర‌కాష్, ఎస్ఎఫ్ ఓ బి. చ‌ర‌ణ్ కుమార్‌ ప్ర‌తి రోజూ ఆ ప‌నుల‌ను ప‌రిశీలించి ప‌ర్య‌వేక్షించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో వెళ్లేవారు, అక్క‌డి నివాసితులు ఆశ్చ‌ర్య‌పోయారు. వ‌ర‌ద కాలువ శుభ్రంగా మార‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

Next Story