రేపు ఏపీ కేబినెట్ మీటింగ్.. అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట

by Malleboina Mahesh |

రేపు ఉదయం 10:30కు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి కొత్త భూసేకరణ రైతులకు ఎకరానికి రూ. 40 వేల యాన్యుటీ, అద్దె భత్యంపై కీలక నిర్ణయాలు!

రేపు ఏపీ కేబినెట్ మీటింగ్.. అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం (జూలై 10, 2026) ఉదయం 10:30 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ (Cabinet) సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాజధాని విస్తరణ కోసం కొత్తగా భూములిచ్చే రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 40,000 చొప్పున యాన్యుటీ (Annual Payment) చెల్లించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ నిర్ణయం రాజధాని నిర్మాణానికి భూములిచ్చే రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది.

దీంతో పాటు, రాజధాని పరిధిలోని గ్రామ కంఠాల్లో అక్రమణల తొలగింపు, మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ కారణంగా ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ఇళ్లు కోల్పోయిన సదరు లబ్ధిదారులకు నెలకు రూ. 10,000 చొప్పున అద్దె భత్యం (Rental Allowance) ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. ల్యాండ్ పూలింగ్ రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయాలతో పాటు, రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలు, ఐటీ పాలసీ, పలు సంక్షేమ పథకాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు.

Next Story