టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధి చేస్తాం : ట్రస్ట్ బోర్డు చైర్మన్

by Batti.Sumithra |

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం.సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన తొలి అధికారిక బోర్డు సమావేశం శనివారం జరిగింది.

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట అభివృద్ధి చేస్తాం : ట్రస్ట్ బోర్డు చైర్మన్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎం.సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన తొలి అధికారిక బోర్డు సమావేశం శనివారం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం, యాదగిరిగుట్టను దేశంలోనే ఆదర్శ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టీటీడీలో అమలవుతున్న భక్తి సేవా విధానాలను అధ్యయనం చేసి, యాదగిరిగుట్టలో అమలు చేయడానికి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తొలి సమావేశంలోనే బోర్డు సభ్యులందరూ క్షేత్రాభివృద్ధి పై నిర్మాణాత్మక సూచనలు చేయడం సంతోషకరమని అన్నారు.

యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు దర్శనం అనంతరం వెంటనే వెళ్లిపోతున్నారని, రాత్రి బస చేసేలా నాణ్యమైన వసతి సౌకర్యాలు కల్పించడం అత్యవసరమని చైర్మన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆమోదించిన బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయం, సుమారు 250 నుంచి 300 మంది భక్తులు బస చేసే సూట్లు, డబుల్, సింగిల్ రూములు, డార్మిటరీల నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. పుష్కరిణిలో నీటి కొరత, కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టెంపుల్ సిటీ ప్రాజెక్టు, దాతల విధానం పై సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఎండ, వానల నుంచి రక్షణ కల్పించేలా పైకప్పు నిర్మాణానికి దాత ముందుకు వచ్చారని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యాల పై ప్రత్యేక సర్వే నిర్వహించి అవసరమైన సర్వీసులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాయగిరి జాతీయ రహదారి నుంచి వచ్చే భక్తులకు మార్గదర్శకంగా సైన్‌బోర్డులు, భవిష్యత్తులో స్వాగత తోరణం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

స్వయంప్రతిపత్తితో వేగంగా నిర్ణయాలు..

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు స్వయంప్రతిపత్తి లభించిన నేపథ్యంలో ఇక పై చాలా నిర్ణయాలు స్థానికంగానే తీసుకుంటామని, అత్యంత కీలక అంశాలను మాత్రమే ప్రభుత్వానికి పంపిస్తామని చైర్మన్ తెలిపారు. భక్తుల అవసరాలే ప్రతి నిర్ణయానికి ప్రాతిపదికగా ఉంటాయని చెప్పారు. భక్తుల సౌకర్యాలు, క్షేత్రాభివృద్ధికి సంబంధించిన అంశాల పై త్వరలో మరోసారి బోర్డు సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఈవో భవాని శంకర్ తదితరాలు పాల్గొన్నారు.

Next Story